CBN On Pensions: పెన్షన్లు ఇవ్వకపోవడంలో వైసీపీ కుట్రల్ని తిప్పి కొట్టాలన్న చంద్రబాబు, వృద్ధుల్ని మోసం చేశారని ఆగ్రహం…-chandrababu says cadre to explain to public about ycp conspiracies in not giving pensions ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cbn On Pensions: పెన్షన్లు ఇవ్వకపోవడంలో వైసీపీ కుట్రల్ని తిప్పి కొట్టాలన్న చంద్రబాబు, వృద్ధుల్ని మోసం చేశారని ఆగ్రహం…

CBN On Pensions: పెన్షన్లు ఇవ్వకపోవడంలో వైసీపీ కుట్రల్ని తిప్పి కొట్టాలన్న చంద్రబాబు, వృద్ధుల్ని మోసం చేశారని ఆగ్రహం…

Sarath chandra.B HT Telugu
Apr 01, 2024 06:46 PM IST

CBN On Pensions: కోడ్‌ రాకముందే 15 రోజుల్లో 13వేల కోట్లను మళ్లించి ఖజానా ఖాళీ చేసి, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుఆరోపించారు.

పెన్షన్లపై సెర్ప్‌ ఉత్తర్వులను సమీక్షించాలని చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు
పెన్షన్లపై సెర్ప్‌ ఉత్తర్వులను సమీక్షించాలని చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు

CBN On Pensions: ఏపీలో పెన్షన్ల వ్యవహారం కాక రేపుతోంది. వాలంటీర్లతో ఇంటింటి పెన్షన్లను పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించడం రాజకీయ యుద్ధానికి దారి తీసింది. ఏప్రిల్ 1 నుంచి పెన్షన్లు అందకపోవడానికి మీరంటే మీరే కారణమని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు టీడీపీ, జనసేనల్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుండటంతో ఆ పార్టీకి చేటు చేస్తోందనే ఆందోళన చెందుతున్నారు. దీంతో వైసీపీ విమర్శల్ని తిప్పి కొట్టాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

సిఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం…

అవ్వాతాత అంటూనే జగన్ వృద్ధుల్ని మోసం చేశాడని, ఇంటి వద్దకు తెచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వెనక వైసీపీ కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడని, జగన్ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పెన్షన్లు ఆపిందంటూ నీచమైన ప్రచారం చేస్తున్నారని పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. 15 రోజుల్లో రూ.13 వేల కోట్లు మళ్లించి ఖజానా ఖాళీ చేశారని,సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా ఇవ్వలేదని ఆరోపించారు.

‘‘పెన్షన్ లపై ప్రభుత్వ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనం. జగన్ కు వచ్చే ఎన్నికల్లో తన ఓటమి అర్థం అయ్యింది...అందుకే ఫేక్ ప్రచారాలు, కుట్ర రాజకీయాలకు స్పీడు పెంచాడని, వృద్ధులు, వికలాంగులకు మానవీయ కోణంలో పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగానే వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందన్నారు.

సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా ఇవ్వలేదని, వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయనీయకూడదని టీడీపీ ఎవరినీ కోరలేదన్నారు.1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు...వారితో ఒక్క రోజులోనే ఇంటింటింకీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వమే కావాలని ఇవ్వలేదని ఆరోపించారు.

ప్రభుత్వ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు..సొంత కాంట్రాక్టర్లకు జగన్ ఇచ్చుకున్నాడని, తన రాజకీయ లబ్ధి కోసం నడి వేసవిలో వృద్ధులు, వికలాంగులకు కూడా జగన్ ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపించారు. గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు.

రూ.నాలుగు వేల పెన్షన్, బకాయిలతో కలిపి చెల్లిస్తాం…

ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని, తన రాజకీయ లబ్ది కోసం బాబాయినే చంపేసిన జగన్...ఓట్ల కోసం ఇలాంటి కుట్రలు అనేకం చేయడనుకోకూడదని, టీడీపీ వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తామన్నారు.

రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అన్ని విషయాలు లబ్ధిదారులకు వివరించాలని, ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మే 13 తరువాత ఇంటికి పోయే ప్రభుత్వం ఖజానాలో ఉన్న డబ్బునంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి...పేదలకు ఇచ్చే డబ్బులు విషయంలో మాత్రం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం కూడా ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. జిల్లా నేతలు కలెక్టర్లు, మండల నేతలు తహశీల్దార్లను కలిసి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పాలన్నారు. వాలంటీర్ల విషయంలో టీడీపీ వైఖరి స్పష్టంగా ఉందని, వైసీపీ కోసం పనిచేయొద్దని, వారి భవిష్యత్ ను చూసుకునే బాధ్యత తమదన్నారు. వాలంటీర్లు ఎన్నికల వేళ తప్పులు చేస్తే వారిపైనా కేసులు పడే అవకాశం ఉందని, వాళ్లు అప్రమత్తంగా ఉండాలని జగన్ రాజకీయ క్రీడలో వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్న అంశాన్ని ప్రతి ఒక్కరికీ వివరించాలని, తన పేరుతోనూ పొత్తులపై తప్పుడు పోస్టులు సృష్టిస్తున్నారని శింగనమలలో బినామీగా ఉన్న డ్రైవర్ కు సీటు ఇచ్చారంటే...దాన్నీ డ్రైవర్ ను అవమానపరిచినట్లు ప్రచారం చేశారని ఆరోపించారు.

సిఎస్‌, ఈసీ సీఈఓలకు టీడీపీ వినతులు…

పెన్షన్ల పంపిణీలో సెర్ప్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యారు. పెన్షన్ల పంపిణీపై సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ప్రధాని అధికారి ముఖేష్‌ కుమార్ మీనాకు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

సంబంధిత కథనం