Team India Jersey: చరిత్రలో తొలిసారి.. ఇండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు
Team India Jersey: చరిత్రలో తొలిసారి ఇండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు కనిపించనుంది. ఆసియా కప్ 2023 కోసం రూపొందించిన జెర్సీల్లో టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్ పేరు అన్ని దేశాల జెర్సీలపై కనిపించనుంది.
Team India Jersey: టీమిండియా జెర్సీలపై ఎప్పుడైనా పాకిస్థాన్ పేరు చూశారా? కానీ ఆసియా కప్ లో మాత్రం ఆ వింత కనిపించనుంది. తొలిసారి ఇలా ఇండియన్ క్రికెట్ టీమ్ వేసుకునే జెర్సీలపై దాయాది పేరు కనిపించనుండటం గమనార్హం. ఆసియా కప్ 2023లో ఇండియన్ టీమ్ వేసుకోబోయే జెర్సీలపై పాక్ పేరు ఉండనుంది.
దీనికి కారణం ఈసారి ఆసియా కప్ టోర్నీకి పాకిస్థానే ఆతిథ్యమిస్తుండటం. నిజానికి ఆతిథ్య హక్కులు మొత్తం పాకిస్థాన్ దగ్గరే ఉన్నా.. ఇండియన్ టీమ్ అక్కడికి వెళ్లడానికి అంగీకరించకపోవడంతో పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా టోర్నీ నిర్వహిస్తున్నాయి. పాకిస్థాన్ లో కేవలం 4 మ్యాచ్ లే జరగనుండగా.. శ్రీలంకలో ఫైనల్ సహా 9 మ్యాచ్ లు జరుగుతాయి.
ఈ టోర్నీ కోసం ఇండియా వేసుకోబోయే జెర్సీపై ఆసియా కప్ 2023 లోగోపైన పాకిస్థాన్ పేరు కనిపిస్తోంది. ఈ కొత్త జెర్సీల్లో టీమిండియా ప్లేయర్స్ ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2న క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో జరుగుతుంది.
ఆసియా కప్ సూపర్ 4లోనూ ఈ రెండు జట్లు తలపడే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ చేరితే ముచ్చటగా మూడుసార్లు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లు చూసే అవకాశం దక్కుతుంది. గతేడాది ఆసియా కప్ లోనూ ఈ రెండు టీమ్స్ రెండుసార్లు తలపడ్డాయి. అయితే ఇండియా ఫైనల్ చేరడంలో విఫలమవడంతో మూడోసారి దాయాదుల ఫైట్ చూసే అవకాశం దక్కలేదు.
ఆసియా కప్ కోసం ఇప్పటికే పాకిస్థాన్ తమ టీమ్ అనౌన్స్ చేసింది. ఇండియా మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీకి బుమ్రాతోపాటు రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.