Hardik Pandya: టీమిండియాకు పెద్ద షాక్.. వరల్డ్ కప్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్.. అతని స్థానంలో ఎవరంటే?
Hardik Pandya Injury: భారత క్రికెట్ టీమ్‌కు అతిపెద్ద షాక్ తగిలింది. ఇండియన్ స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఇప్పటికే గాయాల కారణంగా పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న హార్దిక్ మరోసారి ఔట్ కావడంతో అతని స్థానంలో మరొకరిని జట్టు తీసుకోనుంది.
Hardik Pandya Ruled Out Of World Cup 2023: ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ 2023 మొత్తానికి దూరమయ్యాడు. అక్టోబర్ 19న పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా తన సొంత బౌలింగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దాని నుంచి కోలుకోలేకపోవడంతో హార్దిక్ పాండ్య మ్యాచ్‌కు మరోసారి దూరమయ్యాడు.
హార్దిక్ పాండ్యా స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను భారత జట్టులోకి తీసుకుంటున్నట్లు ఐసీసీ ఓ మీడియా ప్రకటనలో వెల్లడించింది. ప్రసిద్ధ్ కృష్ణకు 17 వన్డేలు ఆడి, 29 వికెట్లు తీసిన అనుభవం ఉంది. ప్రసిద్ధ్ ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది.
కాగా "గత నెలలో పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండకు గాయమైంది. మిగిలిన మ్యాచుల్లో కోలుకుంటాడని అంతా భావించాం. కానీ, ఈ 30 ఏళ్ల ఆల్ రౌండర్ కోలుకోలేకపోయాడు" అని ఐసీసీ సమాచారం ఇచ్చింది.
బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన తర్వాత నాకౌట్ గేమ్‌లకు ఫిట్‌గా ఉంటాడని భావించారు. ఇక హార్దిక్ పాండ్యా చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేశాడు. నాలుగు మ్యాచుల్లో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటివరకు టీమిండియా ఏడు మ్యాచులు ఆడి 7 గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉండి సెమిస్‌లో చోటు సంపాదించుకుంది.