IND vs SL Asia Cup: టాస్ భారత్‍దే.. తుదిజట్టులో ఓ మార్పు.. కారణమిదే..
IND vs SL Asia Cup: ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంకతో టీమిండియా మ్యాచ్ మొదలైంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తుదిజట్టులో ఓ మార్పుతో టీమిండియా బరిలోకి దిగుతోంది.
IND vs SL Asia Cup: ఆసియాకప్ 2023 సూపర్-4లో పాకిస్థాన్‍పై బంపర్ విక్టరీ తర్వాత.. టీమిండియా నేడు (సెప్టెంబర్ 12) శ్రీలంకతో తలపడుతోంది. శ్రీలంక కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానం వేదికగా సూపర్-4లో భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ నేడు మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. పాక్‍తో ఆడిన జట్టుతో పోలిస్తే తుదిజట్టులో టీమిండియా ఓ మార్పు చేసింది. పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్ ఆల్‍రౌండర్ అక్షర్ పటేల్ భారత తుదిజట్టులోకి వచ్చాడు. పిచ్ స్పిన్‍కు అనుకూలంగా ఉండటంతో శార్దూల్‍ను తప్పించి అక్షర్‌ను భారత్ తీసుకుంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
పిచ్‍పై పచ్చిక (గడ్డి) లేదని, స్పిన్నర్లకు అనుకూలించేలా ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్ సమయంలో అన్నాడు. అందుకే శార్దూల్ స్థానంలో అక్షర్ పటేల్‍ను తీసుకున్నామని చెప్పాడు. “మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ప్లేయర్‌గా, జట్టుగా ఎప్పటికప్పుడు సవాళ్లను తీసుకుంటుండాలి. చివరి మ్యాచ్ బాగా ఆడాం. బ్యాటింగ్ బాగా చేశాం. ఆ తర్వాత మంచి బౌలింగ్‍లో డిఫెండ్ చేసుకున్నాం. కానీ ఇది కొత్త రోజు.. కొత్త మ్యాచ్. పిచ్ కాస్త భిన్నంగా కనిపిస్తోంది. చాలా పొడిగా ఉంది. పచ్చిక లేదు. శార్దుల్ స్థానంలో జట్టులోకి అక్షల్ పటేల్‍ను తీసుకొచ్చాం. స్పిన్నర్లకు ఇది అనుకూలించేలా ఉంది. కానీ మా వద్ద ముగ్గురు క్వాలిటీ పేసర్లు కూడా ఉన్నారు” అని రోహిత్ శర్మ చెప్పాడు.
బంగ్లాదేశ్‍తో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‍లో బరిలోకి దిగుతున్నామని శ్రీలంక కెప్టెన్ దసున్ శనక చెప్పాడు. టీమిండియా చాలా బలమైన జట్టు అని, కానీ గెలిచేందుకు పూర్తి సామర్థ్యంతో కృషి చేస్తామని అన్నాడు.
తుది జట్లు ఇవే
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‍దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
శ్రీలంక తుదిజట్టు: పాతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుషాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వ, దసున్ శనక (కెప్టెన్), దిముత్ వెల్లలాగే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరణ