AUS vs NAM T20 World Cup: చీఫ్ సెలెక్టర్, కోచ్‍లనే ఫీల్డర్లుగా వాడిన ఆస్ట్రేలియా.. ఎందుకిలా?-australia uses head coach chief selector as fielders against namibia in t20 world cup 2024 warm up match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Aus Vs Nam T20 World Cup: చీఫ్ సెలెక్టర్, కోచ్‍లనే ఫీల్డర్లుగా వాడిన ఆస్ట్రేలియా.. ఎందుకిలా?

AUS vs NAM T20 World Cup: చీఫ్ సెలెక్టర్, కోచ్‍లనే ఫీల్డర్లుగా వాడిన ఆస్ట్రేలియా.. ఎందుకిలా?

Chatakonda Krishna Prakash HT Telugu
May 29, 2024 08:03 PM IST

T20 World Cup AUS vs NAM warm up match: ఆస్ట్రేలియా జట్టుకు ఓ వింత పరిస్థితి ఎదురైంది. దీంతో టీ20 ప్రపంచకప్ 2024 వామప్ మ్యాచ్‍లో చీఫ్ సెలెక్టర్, కోచ్‍లు ఫీల్డర్లుగా మారారు.

AUS vs NAM T20 World Cup: చీఫ్ సెలెక్టర్, కోచ్‍లనే ఫీల్డర్లుగా వాడిన ఆస్ట్రేలియా.. ఎందుకిలా?
AUS vs NAM T20 World Cup: చీఫ్ సెలెక్టర్, కోచ్‍లనే ఫీల్డర్లుగా వాడిన ఆస్ట్రేలియా.. ఎందుకిలా?

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ సమరానికి ముందు ప్రస్తుతం వామప్ మ్యాచ్‍లు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన ప్రపంచకప్ మెగాటోర్నీ మొదలుకానుండగా.. సన్నాహకంగా వామప్ పోటీలు సాగుతున్నాయి. దీంట్లో భాగంగా నేడు (మే 29) ఆస్ట్రేలియా, నమీబియా మధ్య వెస్టిండీస్‍లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‍ వేదికగా వామప్ మ్యాచ్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్‍లో చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ, హెడ్ కోచ్ ఆండ్రూ డొనాల్డ్ సహా మరో ఇద్దరు కోచింగ్ సిబ్బంది ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే..

ఐపీఎల్ ప్రభావంతో..

టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైన 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లలో 9 మంది ఈ ఏడాది ఐపీఎల్ 2024 టోర్నీ ఆడారు. ఇందులో ఆరుగురు ఇంకా జట్టుతో చేరలేదు. ఐపీఎల్ తర్వాత ప్రస్తుతం ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మార్క్ స్టొయినిస్ ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకా ఆస్ట్రేలియా జట్టులో జాయిన్ అవ్వలేదు. దీంతో నమీబియాతో వామప్ మ్యాచ్‍లో ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‍డొనాల్డ్, చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, అసిస్టెంట్ కోచ్ ఆండ్రే బోరోవెక్ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. జట్టులో 9 మందే ఉండటంతో వీరు కూడా అవసరానికి తగ్గట్టుగా ఫీల్డింగ్‍కు దిగారు.

త్వరలోనే విశ్రాంతిలో ఉన్న ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టుతో కలవనున్నారు. వెస్టిండీస్‍తో మే 31న మరో వామప్ మ్యాచ్ ఆడనుంది ఆసీస్. జూన్ 2న టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. జూన్ 6న ఒమన్‍తో మ్యాచ్‍తో ప్రపంచకప్ పోరును ఆస్ట్రేలియా మొదలుపెట్టనుంది.

ఆస్ట్రేలియా భారీ గెలుపు

నమీబియాతో ఈ వామప్ మ్యాచ్‍లో ఆస్ట్రేలియా అలవోకగా గెలిచింది. లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులే చేయగలిగింది. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా మూడు, జోస్ హాజిల్‍వుడ్ రెండు వికెట్లతో రాణించారు. నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ల విజృంభణతో నమీబియా బ్యాటర్లు రాణించలేకపోయారు.

నమీబియా బ్యాటర్ జెనే గ్రీన్ (38) రాణించారు. మిగిలిన విఫలమయ్యారు. జెనే గ్రీన్ మినహా మరెవరూ 20 పరుగుల మార్క్ చేరలేకపోయారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.

స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 10 ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులు చేసి విజయం సాధించింది. 60 బంతులు మిగిల్చి గెలిచింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో 54 పరుగులతో అజేయ అర్ధ శకతం చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో మెరిపించాడు. ఐపీఎల్‍లో పెద్దగా రాణించలేకపోయిన వార్నర్ వామప్ మ్యాచ్‍లో ఫామ్‍లోకి వచ్చేశాడు. మిచెల్ మార్ష్ (18), టిమ్ డేవిడ్ (26), మాథ్యూ వేడ్ (12 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. మొత్తంగా వామప్ మ్యాచ్‍లో గ్రాండ్‍గా గెలిచింది ఆసీస్.

జూన్ 2వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జరగనుంది.

Whats_app_banner