Tech layoffs March 2024: ఆపిల్, డెల్, ఐబీఎం.. 2024 మార్చిలో లే ఆఫ్స్ ప్రకటించిన కంపెనీలు.. ముందుంది గడ్డుకాలమేనా?
Tech layoffs March 2024: కోవిడ్ సంవత్సరాలలో అవసరానికి మించి రిక్రూట్ చేసుకున్న సంస్థల్లో చాలా టెక్ సంస్థలు 2022 నుంచి తమ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. 2024 లో కూడా ఆ ఒరవడి కొనసాగుతోంది. 2024 లో ఇప్పటివరకు డెల్, ఐబీఎం, ఆపిల్, జీఈ తదితర సంస్థలు లే ఆఫ్స్ ప్రకటించాయి.
Tech layoffs March 2024: టెక్నాలజీ రంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్ల మధ్య ప్రధాన కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించే దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. 2024 మార్చి నెలలో పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఎరిక్సన్, డెల్, ఆపిల్ కంపెనీలు వివిధ కారణాలతో మార్చిలో ఉద్యోగాల కోతను ప్రకటించాయి. 5జీ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో స్వీడన్ లో ఎరిక్సన్ 1,200 ఉద్యోగాలను తొలగించగా, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా డెల్ తన సిబ్బందిని తగ్గించింది.
2024 మార్చిలో టెక్ లేఆఫ్స్
ఎరిక్సన్: 5జీ నెట్ వర్క్ పరికరాలకు డిమాండ్ మందగించడంతో స్వీడన్ లో 1,200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఎరిక్సన్ (Ericsson) ప్రకటించింది. స్వీడిష్ టెలికాం దిగ్గజం ఎరిక్స్ 2024 మార్చిలో ఈ నిర్ణయం ప్రకటించింది. వ్యయ నియంత్రణ ప్రణాళికలో భాగంగా ఈ లే ఆఫ్స్ తప్పడం లేదని ఎరిక్సన్ వెల్లడించింది.ఈ సంవత్సరం సవాళ్లతో కూడిన మొబైల్ నెట్వర్క్స్ మార్కెట్ కొనసాగుతుందని ఎరిక్సన్ అంచనా వేసింది. గత సంవత్సరం కూడా 8,500 మంది లేదా 8% మంది ఉద్యోగులను ఎరిక్సన్ తొలగించింది.
డెల్ తొలగింపు: విస్తృత వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా డెల్ (Dell layoffs) తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించింది. డెల్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ఈ ఫిబ్రవరిలో దాదాపు 1,20,000 గా ఉంది. 2023 లో డెల్ ఉద్యోగుల సంఖ్య 1,26,000గా ఉండేది. డెల్ పీసీలకు డిమాండ్ మందగించడంతో డెల్ క్యూ4 ఆదాయంలో 11 శాతం తగ్గుదల నమోదైంది.
ఆపిల్ లే ఆఫ్స్: భవిష్యత్తులో తీసుకురానున్న ఆపిల్ వాచ్ మోడల్ కోసం మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే లను అభివృద్ధి చేయాలన్న తన అంతర్గత ప్రయత్నాలను ఆపిల్ నిలిపివేసింది. దాంతో, తన డిస్ ప్లే ఇంజనీరింగ్ బృందాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా, అమెరికాలో, అలాగే ఆసియాలోని పలు దేశాల్లో డజన్ల సంఖ్యలో సంబంధిత ఉద్యోగులను (Apple layoffs) తొలగించింది.
ఐబీఎం తొలగింపులు: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ (IBM) కంపెనీ కూడా 2024 మార్చిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగించామన్న (IBM layoffs) విషయాన్ని ఐబీఎం వెల్లడించలేదు. 2024 మార్చిలో మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఐబీఎం ప్రకటించింది. ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ జొనాథన్ అడాషెక్ ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
టర్నిటిన్ కోతలు: టర్నిటిన్ ఈ ఏడాది ప్రారంభంలో 15 మందిని తొలగించింది. కృత్రిమ మేధస్సు ఆధారిత సంస్థ టర్నిటిన్ తన ఇంజనీరింగ్ ఉద్యోగుల సంఖ్యను 18 నెలల్లో 20% తగ్గించింది.