Tata Motors Price Hike: ఈ వాహనాల ధరలను పెంచనున్న టాటా మోటార్స్.. వచ్చే నెల నుంచే..
Tata Motors Price Hike: కమర్షియల్ వాహనాల ధరల పెంపును ప్రకటించింది టాటా మోటార్స్. వచ్చే నెల ప్రారంభం నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. వివరాలివే..
Tata Motors Price Hike: మరోసారి ధరల పెంపునకు సిద్ధమైంది ప్రముఖ సంస్థ టాటా మోటార్స్. ఈసారి ట్రాక్టర్లు, ట్రాలీ వెహికల్స్ రేట్లను అధికం చేయనుంది. వచ్చే నెల (జనవరి 2023) నుంచి కమర్షియల్ వాహనాల (Commercial Vehicles) ధరలు 2 శాతం వరకు పెరగనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించనుంది. అన్ని కమర్షియల్ వాహనాల మోడల్స్, వేరియంట్లపై ధర ఎక్కువవుతుంది.
వాహనాల తయారీ ఇన్‍పుట్ ఖర్చులు పెరగటంతో ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. పెరిగిన ఖర్చుల వల్ల కంపెనీపై భారం పడుతోందని, ఈ కనిష్ఠ పెంపు వల్ల కాస్త ఉపశమనం దక్కుతుందనేలా చెప్పింది.
2023 జనవరి నుంచి కమర్షియల్ వాహనాలపై ధరలు పెంచుతామని టాటా మోటార్స్ ప్రకటించటంతో.. భారత ఈక్విటీ మార్కెట్లలో ఈ కంపెనీ షేరు మంగళవారం లాభాలతో ముగిసింది. మంగళవారం బీఎస్‍ఈలో 1.2 శాతం పెరిగిన టాటా మోటార్స్ షేర్ (Tata Motors Share) రూ.419 చేరింది.
త్వరలో కార్ల ధరలు కూడా..
Tata Motors Price Hike: వచ్చే ఏడాది ప్రారంభంలోనే కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను కూడా టాటా మోటార్స్ పెంచే అవకాశం అధికంగా ఉంది. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉద్ఘారాలకు (Emissions) సంబంధించి మరిన్ని నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీంతో వాటికి తగ్గట్టుగా వాహనాలను టాటా మోటార్స్ రూపొందిస్తోంది. దీంతో పాటు కార్ల ఉత్పత్తికి వినియోగించే ముడి సరుకు ధరలు కొంతకాలంగా పెరుగుతూనే ఉన్నాయని టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర ఇటీవల చెప్పారు. ఈ కారణాలతో వచ్చే ఏడాదిలో ప్యాసింజర్ వాహనాల ధర పెరుగుదల ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కాగా, చివరగా నవంబర్ లోనే కార్ల ధరలను పెంచింది టాటా మోటార్స్.
మరిన్ని సంస్థలు కూడా..
Cars Price Hike: టాటా మోటార్స్ తో పాటు మరిన్ని ఆటోమొబైల్ సంస్థలు కూడా 2023లో ధరలను పెంచనున్నాయి. వచ్చే ఏడాది వాహనాల ధరలను అధికం చేయనున్నట్టు మారుతీ సుజుకీ, రెనాల్ట్, మెర్సెడెస్ బెంజ్, ఆడీ, కియా కూడా ఇప్పటికే ప్రకటించాయి.
టాపిక్