Tata Motors Q4 results: ఊహించినట్లే… అంచనాలను మించిన టాటా మోటార్స్ లాభాలు
2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23)లో ఊహించినట్లే టాటా మోటార్స్ అంచనాలను మించిన ఫలితాలను రాబట్టింది. ఈ Q4 లో టాటా మోటార్స్ నికర లాభాలు రూ. 5,408 కోట్లకు చేరాయి.
Tata Motors Q4 results: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) Q4FY23 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. Q4FY23 లో టాటా మోటార్స్ రూ. 5,407.79 నికర లాభాలను (net profit) ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY22) లో టాటా మోటార్స్ రూ. 1,032.84 కోట్ల నష్టాలను చవి చూసిన విషయం తెలిసిందే. సంస్థ ఆదాయం లో కూడా 36% వృద్ధ నమోదైంది. Q4FY23 లో టాటా మోటార్స్ ఆదాయం రూ. 1.59 లక్షల కోట్లు గా ఉంది.
Tata Motors Q4 results: భవిష్యత్తు మరింత ఆశాజనకం
దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా మార్కెట్లో సానుకూలత నెలకొన్న నేపథ్యంలో.. టాటా వాహనాలకు మరింత డిమాండ్ నెలకొంటుందని భావిస్తున్నారు. వినియోగదారులకు అందుబాటు ధరలో అన్ని ఫీచర్స్ తో, అత్యంత సురక్షితమైన వాహనాలను అందించడమే లక్ష్యంగా సాగుతున్నామని టాటా మోటార్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులు తమ వాహనాల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపబోదని ఆశాభావం వ్యక్తం చేసింది.
Tata Motors Q4 results: రూ. 2 డివిడెండ్
Q4FY23 తో పాటు తమ మదుపర్లకు ఫైనల్ డివిడెండ్ ను కూడా టాటా మోటార్స్ ప్రకటించింది. రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 2 (100%) లను తమ షేర్ హోల్డర్లకు డివిడెండ్ గా అందించాలని నిర్ణయించింది. ఏజీఎంలో షేర్ హోల్డర్ల ఆమోదం అనంతరం ఆగస్ట్ 14 లోగా అర్హులైన షేర్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాల్లో డివిడెండ్ మొత్తం జమ చేస్తామని ప్రకటించింది. FY23 లో టాటా మోటార్స్ పలు కొత్త మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. దాదాపు అవి అన్ని కూడా సక్సెస్ ఫుల్ మోడల్స్ గా నిలిచాయి.