Rupee falls record low: ఒక డాలర్‌కు అక్షరాలా <span class='webrupee'>₹</span> 82.66
Rupee vs USD rate today: యూఎస్‌లో పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక చమురు ధరలు వెరసి భారతీయ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది.
యూఎస్ డాలరుతో పోలిస్తే భారతీయ కరెన్సీ రూపాయి రోజురోజుకూ పడిపోతోంది. అమెరికా ఉద్యోగాల నివేదిక వెలుడిన తరువాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో రూపాయి విలువ సోమవారం ఉదయం 82.33 నుంచి 82.66కు పడిపోయింది. ఇది 83 దిశగా అడుగులు వేస్తోంది.
గత కొద్ది రోజులుగా రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతూ వస్తోంది. చమురు ధరలు, ట్రెజరీ యీల్డ్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధుల ఉపసంహరణ, యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరుగుదల వంటి అంశాలన్నీ రూపాయి పతనానికి కారణమవుతూ వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచుగా జోక్యం చేసుకున్నప్పటికీ రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయలేకపోతోంది.
‘యూఎస్‌లో అధిక వడ్డీ రేట్లు, అధిక చమురు ధరలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డాలరు నిల్వలను ఖర్చు చేస్తూ రూపాయి పతనం కాకుండా జోక్యం చేసుకుంటున్నప్పటికీ అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున డాలరు నిల్వలు ఆవిరివడంతో ఇక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ కారణంగా ఇతర కరెన్సీల తరహాలోనే రూపాయి కూడా భారీ పతనాన్ని చవిచూస్తోంది..’ అని ఐఎఫ్ఏ గ్లోబల్ విశ్లేషించింది.
సెప్టెంబరు 30 నుంచి మొదలైన వారంలో భారత దేశపు ఫారెక్స్ నిలవ్వలు 532.66 బిలియన్ డార్లకు పడిపోయాయి. జూలై 2022 నుంచి ఇదే కనిష్టస్థాయి.
శుక్రవారం చమురు ధరలు 4 శాతం ఎగబాకి ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ సోమవారం స్వల్పంగా తగ్గాయి. చమురు ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్ కూటమి నిర్ణయించడంతో చమురు ధరలు పోయి వారం భారీగా పెరిగాయి. ఆర్థిక మాంద్యం, వడ్డీ రేట్ల పెరుగుదల పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ఒపెక్ కూటమి చమురు ధరల్లో స్థిరత్వం కోసం ఉత్పత్తిలో కోత విధించాలని నిర్ణయించింది.
కాగా సోమవారం ఉదయం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 700 పాయిట్లు కోల్పోయింది.
కాగా సెప్టెంబరులో భారత రీటైల్ ద్రవ్యోల్భణం ఐదు నెలల గరిష్టస్థాయిని తాకనుందని రాయిటర్స్ పోల్ అంచనా వేసింది. ఈ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి.