EV Chargers: కస్టమర్లకు ఆ డబ్బును రీఫండ్ చేయనున్న ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్
EV Chargers: ఎలక్ట్రిక్ చార్జర్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు ప్రముఖ సంస్థలు అంగీకరించాయి. వివరాలివే..
EV Chargers: ఈవీ చార్జర్ల కోసం కస్టమర్లు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ (Refund) చేసేందుకు ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ తయారీ కంపెనీలు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), ఎథెర్ ఎనర్జీ (Ather Energy), హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), టీవీఎస్ (TVS) అంగీకరించాయి. ఈవీ చార్జర్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు డబ్బును ఆ సంస్థలు రీఫండ్ చేయనున్నాయి. ఈవీ చార్జర్లను కంపెనీలు అధిక ధరలకు విక్రయించాయని ఆరోపణలు రావటంతో దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. చార్జర్లకు ఎక్కువ డబ్బు వసూలు చేసిన కంపెనీలకు ఫేమ్-2 కింద ఇవ్వాల్సిన ప్రోత్సహకాలను చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో చార్జర్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు డబ్బు రీఫండ్ చేసేందుకు సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఈ రీఫండ్ మొత్తం రూ.300కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ రీఫండ్ పూర్తయితే.. ఆ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థలు మళ్లీ ఫేమ్-2 ప్రోత్సహకాలను పొందుతాయని తెలుస్తోంది.
EV Chargers: ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కొందరు చార్జర్ల ధరపై అనవసర రాద్దాంతం చేశారని, అందుకే రీఫండ్ అంశం తెరపైకి వచ్చిందని ఓలా ఎలక్ట్రిక్ ఒక స్టేట్‍మెంట్‍లో ప్రకటించింది. “కొన్ని స్వార్థపూరితమైన గ్రూప్‍ల ప్రయత్నాలను దాటుకొని రెండు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది” అని ఓలా పేర్కొంది. అయితే కస్టమర్ల నమ్మకం కోసం తాము చార్జర్ల మొత్తాన్ని రీఫండ్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
EV Chargers:“టెక్నికల్ అంశాలను పక్కన పెట్టి, ఇతరులకు ఉదాహరణగా నిలిచేందుకు చార్జర్ డబ్బును ఎలిజిబుల్ అయిన కస్టమర్లందరికీ రీయింబర్స్ చేయాలని నిర్ణయించున్నాం. ఈవీ విప్లవం పట్ల మాకు ఉన్న నిబద్ధతకు ఇది ఓ నిదర్శనం. దీని వల్ల మా కస్టమర్లకు విశ్వాసం మరింత బలపడుతుంది” అని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది.
EV Chargers: రిపోర్టుల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్.. సుమారు లక్ష మంది కస్టమర్లకు రూ.130కోట్ల వరకు విలువైన రీఫండ్ ఇవ్వనుంది. ఎథెర్ ఎనర్జీ.. 95వేల మంది కస్టమర్లకు రూ.140కోట్ల వరకు రీఫండ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్ సుమారు రూ.18కోట్ల మేర రీఫండ్ చేస్తుందని తెలుస్తోంది. సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు రూ.1,200 కోట్లు చెల్లించాల్సి ఉందని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (SMEV) ఇటీవల పేర్కొంది.
ఫేమ్ స్కీమ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు మంజూరు చేయాల్సిన బకాయిలను అవతకవలు గుర్తించాక కేంద్రం నిలిపివేసింది.