Mold-Tek Technologies: అంచనాలను మించిన మోల్డ్‌టెక్ ఫలితాలు.. లాభంలో మెరుగైన వృద్ధి
Mold-Tek Technologies LTD Q3 Results: 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ అంచనాలను మించి ఫలితాలను సాధించింది. నికర లాభం, ఆదాయం, ఎబిటాలో ఈ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మెరుగైన వృద్ధి సాధించింది.
Mold-Tek Technologies Limited Q3 Results: స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, డిజైనింగ్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ (Mold-Tek Technologies).. మూడో క్వార్టర్ ఫలితాల్లో అదరగొట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (Q3 FY2023) ఫలితాలను ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్‌లో ఆ సంస్థ రూ.9.2కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 452.5 శాతం వృద్ధిగా ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ సంస్థ నికర ఆదాయం రూ.1.67కోట్లుగా నమోదైంది. అంటే ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు అధికంగా నికర లాభాన్ని దక్కించుకుంది ఆ సంస్థ. ఎలక్ట్రిక్ వాహనాలకు 3డీ, 2డీ, రొబోటిక్స్ సేవలను కూడా ఈ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అందిస్తోంది. అమెరికా, యూరప్ సహా మరిన్ని దేశాల్లో మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ సంస్థ కార్యాలయాలు ఉన్నాయి. మూడో క్వార్టర్ ఫలితాలు అంచనాలకు మించి ఉండటంతో మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ షేర్ ధర స్టాక్ మార్కెట్‍లో నేడు(జనవరి 30) సుమారు 10 శాతం పెరిగి రూ.170కు చేరుకుంది. ఈ సంస్థ మూడో క్వార్టర్ పూర్తి ఫలితాలు ఇవే.
Mold-Tek Technologies Limited Q3 Results: నికర లాభంలో మంచి ప్రదర్శన చేసిన మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్.. ఎబిటాలోనూ మెరుగైన వృద్ధిని కనబరిచింది. కిందటి ఏడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే.. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో 300 శాతం వృద్ధితో ఎబిటా రూ.13.6 కోట్లకు చేరింది. టర్నోవర్ 71 శాతం ఎగిసి రూ.40.7 కోట్లకు చేరింది. ఇక 2022 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య రూ.104కోట్ల టర్నవర్‌పై రూ.19కోట్ల నికరలాభాం ఆర్జించింది.
ఎలక్ట్రిక్ వాహనాలకు..
ఎలక్ట్రిక్ వాహన కంపెనీల మోడళ్లకు తమ సంస్థ 3జీ, 2డీ, రొబోటిక్స్ సేవలను అందిస్తోందని మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ ఎండీ జె.లక్ష్మణ రావు తెలిపారు. భారత్‍లో ఈ సర్వీస్‍లను అందిస్తున్న అతికొన్ని కంపెనీల్లో తమది ఒకటని ఆయన వెల్లడించారు. మూడో త్రైమాసికంలో సివిల్, మెకానిక్ విభాగాల్లో తమ సంస్థ మంచి ఫలితాలను సాధించిందని చెప్పారు. “యూరప్, ఉత్తర అమెరికాలోని ఆటోమొబైల్ కంపెనీలకు కూడా మోల్డ్‌టెక్ సర్వీస్‍లను అందిస్తోంది. ఆ దేశాల నుంచి కూడా ఆర్డర్లు పెరుగుతున్నాయి” అని ఆయన అన్నారు.
మరింత డిమాండ్
రానున్న రోజుల్లో ఆటో మొబైల్ సంస్థల నుంచి డిజైన్ సేవల కోసం భారీగా డిమాండ్ ఏర్పడుతుందని, తమ కంపెనీ వృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుందని మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ సీఎండీ లక్ష్మణ రావు అన్నారు. “ఇప్పటికే యూరప్, మెక్సికో నుంచి అధికంగా ఆర్డర్లు వస్తున్నాయి. అమెరికాలోనూ అవకాశాలను కూడా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెరికా మార్కెట్లో విస్తరించేందుకు కనెక్షన్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైనింగ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ రంగ కంపెనీలను కొనుగోలు చేస్తాం” అని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో ఉన్న భాగస్వామ్యాల వల్ల మెకానికల్ విభాగం అధికంగా వృద్ధి చెందిందని ఆయన వెల్లడించారు. తమ కంపెనీ ఆర్డర్ బుక్ ఎన్నో రెట్లు పెరిగిందని, రానున్న త్రైమాసికాల్లో ఈ వృద్ధి కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.