Maruti Suzuki price hike: మారుతి సుజుకీ కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచబోతున్నట్లు మారుతి సుజుకీ (Maruti Suzuki India Ltd) సంస్థ గురువారం ప్రకటించింది.
తమ వాహన శ్రేణి ధరలను పెంచబోతున్నట్లు ఇప్పటికే ప్రముఖ ఆటోమెబైల్ ఉత్పత్తి సంస్థలు టాటా మోటార్స్ (Tata Motors), హీరో మోటో కార్ప్స్ (Hero Motocorp) ప్రకటించాయి. తమ ప్యాసెంజర్ కార్లు, వాణిజ్య వాహనాల ధరను 5% పెంచబోతున్నట్లు టాటా మోటార్స్ (Tata Motors) ప్రకటించగా, తమ ద్విచక్ర వాహన శ్రేణిపై 2% ధర పెంచనున్నట్లు హీరో మోటో కార్ప్స్ (Hero Motocorp) ప్రకటించింది. అయితే, తమ వాహనాలపై ఏ స్థాయిలో ధరలను పెంచబోతున్నామో మారుతీ సుజుకీ (Maruti Suzuki) వెల్లడించలేదు. అయితే, అన్ని మోడల్స్ పై ఈ ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఏప్రిల్ నుంచి భారత్ లో కాలుష్య ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన బీఎస్ 6 (Bharat Stage VI) ప్రమాణాల అమలు ప్రారంభం కాబోతుంది. అన్ని కొత్త వాహనాలు ఆ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అందుకు గానూ, అన్ని వాహన ఉత్పత్తి సంస్థలు తమ వాహనాల్లో ఒక ప్రత్యేక మెషీనరీని అమర్చాల్సి ఉంటుంది. అది ఖరీదైన విషయం కావడంతో, ఆ మేరకు ధరలను పెంచాలని దాదాపు అన్ని వాహన ఉత్పత్తి సంస్థలు నిర్ణయిస్తున్నాయి. మరోవైపు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో అన్ని విడి భాగాల ధరలు పెరుగుతున్నాయని, దాంతో, ధరల పెంపు అనివార్యమవుతోందని అవి వెల్లడిస్తున్నాయి. భారత్ లో ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో 11% పెరిగాయి.
టాపిక్