Anand Mahindra: నా ఫోన్‍ను పక్కన పెట్టేలా చేసింది: బాధాకరమైన కార్టూన్‍ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా-made me put down my phone anand mahinda shares depressing cartoon on overusing smartphones ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Anand Mahindra: నా ఫోన్‍ను పక్కన పెట్టేలా చేసింది: బాధాకరమైన కార్టూన్‍ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: నా ఫోన్‍ను పక్కన పెట్టేలా చేసింది: బాధాకరమైన కార్టూన్‍ను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 27, 2022 09:59 PM IST

Anand Mahindra Latest Tweet: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ట్విట్టర్ లో ఓ కార్టూన్ షేర్ చేశారు. తాను ఫోన్‍ను పక్కన పెట్టేలా ఆ కార్టూన్ చేసిందని రాసుకొచ్చారు.

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: స్మార్ట్ ఫోన్‍ను అతిగా వినియోగించటం వల్ల ఎంతో హానికరమైన ప్రభావాలు ఉంటాయని ఇప్పటికే చాలా పరిశోధనలు వెల్లడించాయి. మొబైళ్లను ఎక్కువగా వినియోగిస్తే మానసిక ఆరోగ్యానికి కూడా ప్రమాదమేనని పేర్కొన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా ఫోన్‍లకే ఎక్కువగా అతుక్కుపోతున్నారు. వీడియోలు చూడడం దగ్గరి నుంచి గేమ్స్ వరకు ఎక్కువసేపు మొబైల్‍లో గడుపుతున్నారు. ఇక కొందరు పెద్దలు మరీ విపరీతంగా ఫోన్లు వాడుతున్నారు. అయితే, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఈ ట్రెండ్ కలవరపెడుతోంది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ట్రెండ్‍ పర్యవసానాలను కళ్లకు కట్టిన ఓ బాధాకరమైన కార్టూన్‍ను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తాను ఫోన్‍ను పక్కన పెట్టేలా ఆ కార్టూన్ చేసిందని పేర్కొన్నారు.

“ఇది తీవ్రంగా బాధ కలిగించే కార్టూన్. కానీ నా ఫోన్‍ను పక్కన పెట్టేలా ఇది చేసింది (ఈ ట్వీట్ చేసిన తర్వాత!). మెడను నిటారుగా ఉంచుకొని, తల ఎత్తుకొని నా ఆదివారాన్ని గడిపేలా చేసింది” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఆ కార్టూన్‍లో ఏముందంటే..

Anand Mahindra Shares Cartoon: “నర్సింగ్ హోమ్ ఇన్ ఏ పోస్ట్ టెక్ట్సింగ్ వరల్డ్” అనే టైటిల్‍తో ఆ కార్టూన్ ఉంది. భవిష్యత్తులో నర్సింగ్ హోమ్‍లు ఎలా ఉండబోతున్నాయన్న ఊహతో ఈ కార్టూన్ రూపొందింది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్‍లకు ప్రస్తుతం మనుషులు ఎలా బానిసలయ్యారో చెప్పేలా సెటైరికల్‍గా ఈ కార్టూన్ ఉంది. నర్సింగ్ హోమ్‍లో అనారోగ్యంతో ఉన్న సమయంలోనూ ఆ కార్టూన్‍లో ఉన్న వారు కిందే చూస్తుంటారు. తల కిందికే బెండ్ అయి ఉంటుంది. అంటే ఫోన్‍ను చూసిచూసి వారు అలా అయిపోయారని ఆ కార్టూన్ చెబుతోంది.

ఫోన్‍లను అతిగా ఎందుకు వాడుతున్నారంటే..!

స్మార్ట్ ఫోన్‍ను అతిగా, తీవ్రంగా వినియోగిస్తే శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఫ్రంటియర్స్ వెబ్‍సైట్ ఇటీవల ఓ అధ్యయానాన్ని పబ్లిష్ చేసింది. యెహుడా వాక్స్, అవివ్ వీన్ స్టీన్ రివ్యూల ప్రకారం దీన్ని వెల్లడించింది. బోర్ కొట్టడం వల్ల, ప్రతికూల పరిస్థితులను తప్పించుకునేందుకు, ఎంటర్ టైన్‍మెంట్ కోసం స్మార్ట్ ఫోన్‍లను అతిగా వాడడం ఎక్కువ మంది ప్రారంభిస్తున్నారని పేర్కొంది.

కాగా, షార్ట్ వీడియోల కారణంగా కూడా చాలా మంది స్మార్ట్ ఫోన్‍లను అతిగా వాడుతున్నారని కూడా ఇటీవల కొన్ని రిపోర్టులు వచ్చాయి. తక్కువ నిడివి గల ఈ వీడియోలను ఒకదాని తర్వాత మరొకటి చూస్తూ అలాగే చాలా మంది ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతం షార్ట్ వీడియోలకు చాలా ఆదరణ లభిస్తోంది. కోట్లాది మంది వ్యూస్‍ను సాధిస్తున్నాయి. షార్ట్ వీడియోలు మంచి ఆదాయం సృష్టిస్తుండటంతో చాలా కంపెనీలు ఈ సర్వీస్‍ను అందుబాటులోకి తెస్తూనే ఉన్నాయి.

టాపిక్