Kia Sonet facelift SUV: వచ్చేవారమే కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ లాంచ్; ధర, ఫీచర్స్, ఇతర డీటెయిల్స్ మీ కోసం..
Kia Sonet facelift SUV: 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ పెట్రోల్, డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. కొత్తగా పొందుపర్చిన ఫీచర్లలో ADAS టెక్నాలజీ ఒకటి.
Kia Sonet facelift SUV: తమ కాంపాక్ట్ ఎస్యూవీ సోనెట్ ను కస్టమర్లకు మరింత దగ్గర చేసే లక్ష్యంతో 2024 ఫేస్ లిఫ్ట్ వర్షన్ ను కియా తీసుకువచ్చింది. ఈ లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ ను డిసెంబర్ 14వ తేదీన, ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో లాంచ్ చేయనుంది. ఈ ఎస్యూవీ టాటా నెక్సాన్, మారుతి సుజుకీ బ్రెజాలతో మార్కెట్లో పోటీ పడనుంది.
ఎల్ఈడీ హెడ్ లైట్స్
రాబోయే సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ (Kia Sonet facelift SUV) కి చెందిన కొన్ని టీజర్ వీడియోలను కియా షేర్ చేసింది. వాటి ప్రకారం.. కొత్త సోనెట్ అప్‌డేట్ చేసిన ఫ్రంట్ ఫేస్‌తో వస్తోంది. ఇందులో తాజా సెట్ LED హెడ్‌లైట్లు, DRL యూనిట్లు, కనెక్ట్ చేయబడిన LED స్ట్రిప్‌తో అప్‌డేట్ చేయబడిన LED టెయిల్ లైట్లు ఉన్నాయి.ఇందులో 16 అంగుళాల రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్‌ను ఏర్పాటు చేశారు.
ఇంటీరియర్..
కొత్త కియా సోనెట్ ఇంటీరియర్ లో కూడా అనేక మార్పులు చేశారు. ఈ ఫేస్ లిఫ్ట్ సోనెట్ లో కొత్తగా 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే, అప్‌డేట్ చేసిన సోనెట్ లెవల్ 1 ADAS టెక్నాలజీని వాడే డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటాయి. ఇది దాదాపు 10 ADAS ఫీచర్‌లను అందజేస్తుందని కంపెనీ చెబుతోంది. వీటిలో కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.
10 కలర్ ఆప్షన్స్..
యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొత్త సోనెట్ మ్యాట్ ఎడిషన్‌తో పాటు 10 కలర్ ఆప్షన్‌లతో వస్తుంది. కొత్త సోనెట్‌లో 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్, ఇతర ఫీచర్లతో పాటు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉంటుంది.
ఇంజన్ ఆప్షన్స్
సరికొత్త కియా సోనెట్ లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. సోనెట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్‌తో సహా మూడు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి సోనెట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్, 1.2-లీటర్ నాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. 1.0-లీటర్ యూనిట్ 118 bhp శక్తిని, 172 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ మోడల్స్ లో 6 స్పీడ్ ఐఎంటీ (iMT), లేదా 7 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.