HUL Q3 results: మెప్పించిన హిందుస్తాన్ యూనిలివర్ త్రైమాసిక ఫలితాలు
HUL Q3 results: హెచ్‌యూఎల్ లిమిటెడ్ మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించింది.
హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మూడో త్రైమాసిక ఫలితాలతో స్టాక్ మార్కెట్ వర్గాలను మెప్పించింది. దేశంలోనే అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ అయిన హెచ్‌యూఎల్ ఏకీకృత నికర లాభం 11.6 శాతం పెరిగి రూ. 2,505 కోట్లకు చేరుకుంది. పెరిగిన ముడి సరుకు ధరల వల్ల ఏర్పడిన వ్యయాలు సేల్స్ పెరగడం వల్ల కవర్ అయ్యాయి. గత ఏడాది మూడో త్రైమాసికంలో హెచ్‌యూఎల్ రూ. 2,243 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
బ్లూమ్‌బెర్గ్ సర్వేలో పాల్గొన్న అనలిస్టులు హెచ్‌యూఎల్ లాభాలు రూ. 2,497.90 కోట్లుగా ఉంటాయని అంచనా వేశారు. ఈ అంచనాలను మించి హెచ్‌యూఎల్ లాభాలు ప్రకటించింది.
హెచ్‌యూఎల్ ఆధాయంలో 16 శాతం వృద్ధి కనబడింది. గత ఏడాది క్యూ3లో ఈ ఆదాయం రూ. 12,900 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 14,986 కోట్ల ఆదాయం నమోదు చేసింది. బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్ రంగాల్లో మంచి వృద్ధి కనబరిచింది. అలాగే లాండ్రీ సెగ్మెంట్‌లో కూడా ధరల పెరుగుదల వల్ల ఆదాయం వృద్ధి నమోదైంది.
సెగ్మెంట్ వారీగా చూస్తే హోమ్ కేర్ రంగం 32 శాతం రెవెన్యూ వృద్ధి కనబరిచింది. బ్యూటీ, పర్సనల్ కేర్ రంగాలు 10 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇక ఫుడ్స్, రీఫ్రెష్‌మెంట్ రంగాలు 7 శాతం వృద్ధిని కనబరిచాయి. ఈ రంగంలో కాఫీ, ఐస్ క్రీమ్ ఉత్పత్తుల్లో గణనీయమైన వృద్ధి కనబడింది.
‘మా వ్యాపారాన్ని మరింత చురుగ్గా నిర్వహించేందుకు దృష్టి కేంద్రీకరించాం. కస్టమర్ల బేస్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ మార్జిన్లు మెరుగ్గా ఉండేలా కృషి చేస్తున్నాం..’ అని హెచ్‌యూఎల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా చెప్పారు.
గురువారం హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు 1.61 శాతం నష్టపోయి రూ. 2,643 వద్ద ట్రేడవుతున్నాయి.