Hero Mavrick Scrambler 440 : హీరో మావ్రిక్ 440 స్క్రాంబ్లర్.. మరో స్టైలిష్ బైక్ వచ్చేస్తోంది!
Hero Mavrick Scrambler 440 : హీరో మోటోకార్ప్ నుంచి మరో కొత్త, స్టైలిష్ బైక్ రాబోతోందా? అది మావ్రిక్ స్క్రాంబ్లర్ 440 అవుతుందా?
Hero Mavrick Scrambler 440 : హీరో మోటోకార్ప్ సంస్థ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఫ్లాగ్షిప్ బైక్ అయిన మావ్రిక్ 440ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది హార్లే-డేవిడ్సన్తో కలిసి అభివృద్ధి చేసిన బైక్. ఫలితంగా ఎక్స్440తో దీనికి చాలా పోలికలే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. హీరో మోటోకార్ప్ సంస్థ.. 'మావ్రిక్ 440 స్క్రాంబ్లర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకుంది. ఇది.. మావ్రిక్ 440కి మరో వేరియంట్ లేదా వర్షెన్ అని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
హీరో మావ్రిక్ 440 స్క్రాంబ్లర్..
స్క్రాంబ్లర్ వెర్షన్ కోసం, హీరో మోటోకార్ప్ బైక్‌లో కాస్మొటిక్స్ పరంగా ఎక్కువ మార్పులు కనిపించొచ్చు. డ్యూయెల్ పర్పస్ టైర్లు, వెడల్పాటి హ్యాండిల్ బార్, కొత్త సీటు, విభిన్న ఫుట్ పెగ్‌ల సెట్‌ను ఆశించొచ్చు. సాధారణంగా స్క్రాంబ్లర్లు 19 ఇంచ్ ఫ్రంట్ వీల్‌తో వస్తాయి. కాబట్టి హీరో కొత్త బైక్ వీల్ సైజును కూడా మార్చే అవకాశం ఉంది. హ్యాండ్ గార్డులు, వేరే మడ్‌గార్డ్, ఫ్యూయెల్ ట్యాంక్ వంటి ఇతర మార్పులు కూడా ఉండవచ్చు.
ఈ మోటార్ సైకిల్ 440 సీసీ, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,000 ఆర్పీఎమ్ వద్ద గరిష్టంగా 27 బీహెచ్పీ పవర్.. 4,000 ఆర్పీఎమ్ వద్ద 36 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎక్స్ 440 టార్క్ 2 ఎన్ఎమ్ కంటే కొద్దిగా తక్కువ. తక్కువ-ఎండ్ టార్క్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇంజిన్ని ట్యూన్ చేయడం జరిగింది. ఇది సిటీ ట్రావెలింగ్ హైవే ప్రయాణాలకు సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో 6-స్పీడ్ గేర్ బాక్స్ తో కనెక్ట్ చేసి ఉంటుంది.
Hero Mavrick 440 : కొత్త హీరో మావ్రిక్ 440 స్క్రాంబ్లర్ ఫీచర్స్‌లో కూడా పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. ఫీచర్ సెట్ అలాగే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, అన్ని ఎల్ఈడీ లైటింగ్‌తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ బైక్ ఒక స్క్రాంబ్లర్ కాబట్టి.. దీనికి స్విచ్చెబుల్ ఏబిఎస్ ను యాడ్ చేసే అవకాశం లేకపోలేదు.
Hero Mavrick 440 price in Hyderabad : అయితే.. ట్రేడ్‌మార్క్ దాఖలు చేసినంత మాత్రాన.. ఆ బైక్ లాంచ్ అవుతుందని కచ్చితంగా చెప్పడానికి లేదు. కొన్నిసార్లు, తయారీదారులు.. పేరుపై హక్కులను పొందుతారు, తద్వారా మరెవరూ దానిని ఉపయోగించలేరు. దానిని వాడటం, వాడకపోవడం ఆ తర్వాత వారి ఇష్టం.
సంబంధిత కథనం