Hidden Cameras Detect : హోటల్ బెడ్‌రూమ్, వాష్‌రూముల్లో సీక్రెట్ కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?-gudlavalleru incident 8 ways to detect hidden cameras in hotel rooms know how to identify secret cameras in washrooms ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hidden Cameras Detect : హోటల్ బెడ్‌రూమ్, వాష్‌రూముల్లో సీక్రెట్ కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?

Hidden Cameras Detect : హోటల్ బెడ్‌రూమ్, వాష్‌రూముల్లో సీక్రెట్ కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?

Anand Sai HT Telugu
Sep 01, 2024 03:19 PM IST

Hidden Cameras Detect : ఇటీవల హిడెన్ కెమెరాలకు సంబంధించిన ఘటనలు వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువే ఉన్నాయి. అయితే మీరు హోటల్ వెళ్లినప్పుడు సీక్రెట్ కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి? వాటిని డిస్‌కనెక్ట్ ఎలా చేయాలి?

సీక్రెట్ కెమెరాలను గుర్తించాలి?
సీక్రెట్ కెమెరాలను గుర్తించాలి?

టెక్నాలజీ పెరిగింది.. నేరాలు కూడా పెరిగాయి. చాలా మంది ఇటీవల అధికంగా ఎదుర్కొనే సమస్య.. సీక్రెట్ కెమెరాల గురించి. ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, తెలంగాణలోని శంషాబాద్‌ దగ్గర హోటల్‌లో హిడెన్ కెమెరాల ఘటనలపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇలాంటి ఘటనలతో చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి? కొన్నిసార్లు హోటల్ రూముల్లో వెళ్తాం.. ఏదైనా ప్రైవేట్ ప్రాంతాల్లో వాష్ రూములను ఉపయోగిస్తాం. అలాంటి సమయంలో సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలి?

ప్రయాణాలు, హోటల్‌లో బస అనేది ఈరోజుల్లో సాధారణం. అలాంటి సమయంలో మనం వ్యక్తిగతంగా ఎంత సేఫ్‌గా ఉన్నామని కూడా చూసుకోవాలి. హిడెన్ కెమెరాలతో జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. వాటిని తెలివిగా గదిలోని ఏ మూలలోనైనా ఉంచవచ్చు. గుర్తించేందుకు చాలా కష్టపడాలి. అయితే ఎలా గుర్తించాలి అని మీకు తెలిసి ఉండాలి. వాటి గురించి చూద్దాం..

వస్తువులను చూడండి

మీ గదిలో రహస్య కెమెరాలు ఉన్నాయని మీరు అనుమానించినట్లయితే మీ పరిసరాలను భౌతికంగా పరిశీలించడం మంచిది. అసాధారణంగా అనిపించే ఏవైనా వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా గడియారాలు, స్మోక్ డిటెక్టర్‌లు, గోడ అలంకరణలు, USB ఛార్జింగ్ బ్లాక్‌లను సాధారణంగా సీక్రెట్ కెమెరాలకు వినియోగిస్తారు. ఏదైనా సందేహం ఉంటే పరికరాన్ని అన్‌ప్లగ్ చేయండి. అవి బ్యాటరీతో పనిచేసేవి అయితే బ్యాటరీని తీసివేయండి.

లైట్ల కోసం చెక్ చేయండి

సీక్రెట్ కెమెరాను గుర్తించడానికి సమర్థవంతమైన పద్ధతి లైట్ల కోసం చెక్ చేయడం. ఒక్కసారి గదిలోని లైట్లు అంతా ఆపేయండి. వీలైనంత చీకటిగా ఉన్న తర్వాత ఆపై లైటింగ్ ఎటువైపు నుంచి వస్తుందో చూడండి. చీకటిలో మెరిసే లేదా ప్రకాశించే చిన్న LED లైట్‌ని కలిగి ఉండే కొన్ని రహస్య కెమెరాలు ఉన్నాయి. వాటిని గుర్తించాలి.

టార్చ్ ఉపయోగించండి

కొన్ని సందర్భాల్లో ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించడం సీక్రెట్ కెమెరాలను గుర్తించడంలో సహాయపడుతుంది. గదిని పూర్తిగా చీకటిగా చేయాలి. సెల్‌ఫోన్‌లో ఫ్లాష్‌ లైట్ ఆన్ చేయండి. గది చుట్టూ ఫ్లాష్‌లైట్‌తో తిప్పండి. ఏదైనా చిన్నగా నీలం లేదా ఊదా రంగులో మెరుస్తున్నట్లుగా కనిపించవచ్చు. మినీ కెమెరా లెన్స్ నుండి ఆ లైట్ రావొచ్చు. వాటిని గుర్తించాలి.

అద్దాలను చెక్ చేయండి

కొన్నిసార్లు కెమెరాలు అద్దం వెనుక దాగి ఉండవచ్చు. అద్దం ఉపరితలంపై మీ వేలి కొనను ఉంచండి. అప్పుడు మీ వేలి కొన, దాని ప్రతిబింబం మధ్య అంతరాన్ని చూడండి. ఈ రెండింటి మధ్య అంతరం కనిపిస్తే అందులో ఏమీ లేదని అర్థం. అయితే మీ వేలు, దాని ప్రతిబింబం తాకినట్లయితే దాని వెనుక కెమెరా ఉండవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించండి

అనేక రకాల రహస్య కెమెరాలు ఉపయోగంలో ఉన్నప్పుడు కాంతిని విడుదల చేస్తాయి. మీరు దీన్ని స్వయంగా చూడలేరు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్ సహాయం చేయగలదు. చాలా సందర్భాలలో వెనక వైపున ఉన్న కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్ ఫిల్టర్‌లను కలిగి ఉంటాయి. మీ గదిని వీలైనంత చీకటిగా ఉంచాలి. గదిని స్కాన్ చేయడానికి మీ ఫోన్ కెమెరాను ఉపయోగించండి.

మీ వైఫై నెట్‌వర్క్‌ని స్కాన్ చేయండి

కొన్ని రహస్య కెమెరాలు రిమోట్ పర్యవేక్షణ కోసం ఇంటర్నెట్ కనెక్టివిటీని ఉపయోగించుకోవచ్చు. సీక్రెట్ కెమెరా Wi-Fiని ఉపయోగిస్తుంటే, మీది అదే నెట్‌వర్క్‌కు లింక్ అయితే.. వైఫై స్కాన్ ద్వారా గుర్తించే అవకాశం ఉంది. నెట్‌వర్క్ స్కానింగ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఇది చేయెుచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ యాప్ స్టోర్‌ని తెరిచి నెట్‌వర్క్ స్కానర్ యాప్ ఇన్‌స్టాల్ చేయండి. మీరు నెట్‌వర్క్ స్కానర్ సరిగ్గా పని చేయడానికి స్కాన్ చేయాలనుకుంటున్న వైఫై రూటర్‌కి కనెక్ట్ అయ్యారని చూసుకోవాలి. మీరు యాప్ ఫలితాలను చూస్తున్నప్పుడు IPcamera వంటి తెలియని లేదా అనుమానాస్పదంగా కనిపించే ఏవైనా పేర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.

సిగ్నల్ గురించి చెక్ చేయండి

అనేక నిఘా కెమెరాలు సమీపంలోని ఫోన్ కాల్‌లకు అంతరాయం కలిగించే రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. ఉదాహరణకు సీక్రెట్ కెమెరాకు దగ్గరలో ఫోన్ మాట్లాడుతుంటే.. శబ్ధాలు వేరుగా వస్తాయి. ఈ టెక్నిక్‌ని ఉపయోగించేందుకు ఎవరికైనా కాల్ చేసి వారిని లైన్‌లో ఉండమని అడగండి. కాల్‌లో ఉన్నప్పుడు ఏదైనా శబ్ధాలు అసాధారణంగా ఉంటే ఆ ప్రాంతం చుట్టూ తిరగండి. మీరు నిర్దిష్ట ప్రదేశంలో కాల్ సరిగా లేకుంటే అది సీక్రెట్ కెమెరాకు దగ్గరగా ఉన్నట్టు అర్థం.

సీక్రెట్ కెమెరా డిటెక్టర్ యాప్‌

హిడెన్ కెమెరాలను కనుగొనడంలో సహాయం చేయడానికి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. సీక్రెట్ కెమెరా డిటెక్టర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. అనేక యాప్‌లు Wi-Fi స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్, ఇన్‌ఫ్రారెడ్ డిటెక్షన్‌తో సహా పలు టెక్నిక్‌లతో సీక్రెట్ కెమెరాలను గుర్తిస్తాయి.