Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ వచ్చేసింది: రూ.4వేల ఆఫర్‌తో సేల్ షురూ: ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే
Google Pixel 7a launched: గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. సేల్ కూడా మొదలైంది. లాంచ్ ఆఫర్ కింద రూ.4,000 తగ్గింపు పొందే అవకాశం ఉంది. పిక్సెల్ 6ఏతో పోలిస్తే చాలా అప్‍గ్రేడ్‍లతో గూగుల్ పిక్సెల్ 7ఏ వచ్చింది.
Google Pixel 7a launched: పిక్సెల్ ఏ లైనప్‍లో సరికొత్త మిడ్ రేండ్ స్మార్ట్‌ఫోన్‍ను టెక్ దిగ్గజం గూగుల్ (Google) తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్ ద్వారా గూగుల్ ఈ ఫోన్‍ను విడుదల చేసింది. పిక్సెల్ 6ఏతో పోలిస్తే ఈ గూగుల్ పిక్సెల్ 7ఏ చాలా అప్‍గ్రేడ్‍లను కలిగి ఉంది. డిజైన్ కూడా ప్రీమియమ్‍గా ఉంది. Google Pixel 7a పూర్తి వివరాలు ఇవే.
గూగుల్ పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్లు
Google Pixel 7a Specifications: 6.1 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ OLED డిస్‍ప్లేతో గూగుల్ పిక్సెల్ 7ఏ వచ్చింది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6ఏ ఫోన్ 60Hz డిస్‍ప్లేతో ఉండగా.. ఈ విషయంలో 7ఏ అప్‍గ్రేడ్ అయింది. ఈ పిక్సెల్ 7ఏ డిస్‍ప్లేకు కార్నింగ్ గొరిల్లాగ్లాస్ 3 ప్రొటెక్షన్, హెచ్‍డీఆర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
ఫ్లాగ్‍షిప్ ప్రాసెసర్‌తో..
Google Pixel 7a Processor: గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్‍లో లేటెస్ట్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ ఉంది. ఫ్లాగ్‍షిప్ పిక్సెల్ 7, పిక్సెల్ 7ప్రోలో ఉన్న చిప్‍సెట్ ఇది. ప్రాసెసర్ విషయంలో గత ఏ ఫోన్‍తో పోలిస్తే ఈ పిక్సెల్ 7ఏ భారీ అప్‍గ్రేడ్‍ను పొందింది. ఇక టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్ కూడా ఈ ఫోన్‍లో ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‍తో ఈ ఫోన్ వస్తోంది. 5జీ నెట్‍వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో గూగుల్ పిక్సెల్ 7ఏ వచ్చింది.
64 మెగాపిక్సెల్ కెమెరాతో..
Google Pixel 7a Cameras: గత మోడల్‍తో పోలిస్తే కెమెరాల విషయంలోనూ గూగుల్ పిక్సెల్ 7ఏ భారీగా అప్‍గ్రేడ్ అయింది. పిక్సెల్ 7ఏ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు గూగుల్ పొందుపరిచింది.
వైర్లెస్ చార్జింగ్ సపోర్టుతో..
Google Pixel 7a Battery: గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్‍లో 4,385 బ్యాటరీ ఉంది. 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్సులో చార్జర్ ఉండదు. మరోవైపు వైర్లెస్ చార్జింగ్‍కు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. పిక్సెల్ ఏ లైనప్‍లో వైర్లెస్ చార్జింగ్‍ను తొలిసారి ఇచ్చింది గూగుల్. ఈ ఫోన్ మొత్తంగా 193 గ్రాముల బరువు ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్‍తో గూగుల్ పిక్సెల్ 7ఏ వస్తోంది.
గూగుల్ పిక్సెల్ 7ఏ ధర, సేల్
Google Pixel 7a Price in India: గూగుల్ పిక్సెల్ 7ఏ ఒకే వేరియంట్‍లో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.43,999గా ఉంది. నేడే (మే 11) ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ ఫోన్ సేల్ కూడా మొదలైంది. చార్కోల్ స్నో, సీ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.
Google Pixel 7a Offer: లాంచ్ ఆఫర్ కింద, గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్‍ను ఇప్పుడు హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే రూ.4,000 డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఆఫర్ ఉపయోగించుకొని ఈ ఫోన్‍ను రూ.39,999కే దక్కించుకోవచ్చు.
ఈ మొబైల్‍తో పాటు కొంటే పిక్సెల్ బడ్స్-ఏ సిరీస్ ను రూ.3,999కే దక్కించుకోవచ్చు. ఫిట్‍బిట్ ఇన్‍స్పైర్‌ను కూడా రూ.3,999కు సొంతం చేసుకునే అవకాశం ఉంది.