First Honda electric motorcycle: త్వరలో మార్కెట్లోకి హోండా నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్
First Honda electric motorcycle: టూవీలర్ మార్కెట్లో కీలకంగా ఉన్న హోండా సంస్థ 2024 లో తొలి ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
First Honda electric motorcycle: వచ్చే ఏడాది భారతదేశంలో 110-125 సిసి సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నట్టు హోండా గ్లోబల్ (Honda Global) ధృవీకరించింది. ఎలక్ట్రిక్ బైక్స్ దిశగా ముందుకు వెళ్లే ప్రణాళికలో భాగంగా ఈ - బైక్ ను మార్కెట్లోకి తీసుకు వస్తున్నామని తెలిపింది. ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో 2030 నాటికి 3.4 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 4 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలను (electric vehecles) అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది.
స్వాప్ చేయగల బ్యాటరీ ప్యాక్
హోండా (Honda) లాంచ్ చేస్తున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్వాప్ చేయగల బ్యాటరీలతో వస్తుంది. భారత్ లో ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్ ను మొదట భారతదేశంలో, ఆ తరువాత ఇతర ASEAN మార్కెట్లు, జపాన్, యూరప్ లలో లాంచ్ చేయాలని భావిస్తున్నారు. 110-125 సిసి సెగ్మెంట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేయనున్నట్లు హోండా ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. వాటిలో ఒక ఇ-స్కూటర్‌కు ఫిక్స్ డ్ బ్యాటరీని, మరొక మోడల్ లో మార్చుకోగల బ్యాటరీని అమర్చనున్నారు.
భవిష్యత్తు ఈ - బైక్స్ దే..
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లపై మరింత దృష్టి పెట్టనున్నట్లు హోండా సంస్థ ప్రకటించింది. వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందిస్తామని, భారత్ సహా గ్లోబల్ మార్కెట్లకు అవసరమైన యూనిట్లను భారత్ లోనే ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని వెల్లడించింది. 2027 నాటికి భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికే ప్రత్యేకంగా ఒక ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపింది. ఆ ప్లాంట్ నుంచి 2027 తరువాత సంవత్సరానికి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగలదని వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 2800 కోట్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది.