E-rupee for retail users: ఈనెలలోనే రీటైల్ యూజర్లకూ డిజిటల్ కరెన్సీ
digital currency for retail users: రీటైల్ సెగ్మెంట్ యూజర్లకు డిజిటల్ కరెన్సీ ఈనెలలోనే అందుబాటులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ప్రయోగాత్మకంగా డిజిటల్ కరెన్సీ అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేవలం కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులకు, అది కూడా సెకెండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీస్ లావాదేవీలకు సంబంధించి మాత్రమే డిజిటల్ కరెన్సీ లావాదేవీలను పరీక్షించింది.
మొదటి రోజున బ్యాంకులు రూ. 275 కోట్ల విలువైన బాండ్లను ఈ డిజిటల్ కరెన్సీ ఉపయోగించి ట్రేడింగ్ చేశాయి. ప్రస్తుతం హోల్‌సేల్ సెగ్మెంట్‌కే పరిమితైమన డిజిటల్ కరెన్సీని ఈనెలలోనే రీటైల్ యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
కాగా రేపు గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం కానుంది. ద్రవ్యోల్భణానికి సంబంధించిన లక్ష్యాల సాధనలో వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉంటుంది. మధ్యకాలిక లక్ష్యంగా ద్రవ్యోల్భణం 4 శాతానికి అటుఇటుగా (2 శాతం ప్లస్ లేదా మైనస్) ఉండేలా రిజర్వ్ బ్యాంక్ చూడాల్సి ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ఇక్కడి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడారు.
ద్రవ్యోల్భణ లక్ష్యాల సాధనలో వైఫల్యాలపై రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి రాసే లేఖను బహిర్గతం చేయకపోవడం కారణంగా పారదర్శకతలో ఎలాంటి రాజీ ఉండదని అన్నారు.
ధరల స్థిరత్వం, సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం ఒకదానికొకటి ప్రత్యేకంగా ఉండనవసరం లేదని అన్నారు. భారత దేశం ప్రపంచానికి ఆశావాదం, తిరిగి పుంజుకునే సత్తాను ప్రపంచానికి చాటి చెబుతోందని శక్తికాంత దాస అన్నారు.
రీటైల్ సెగ్మెంట్ కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ నెలలోనే అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
దేశ కరెన్సీ చరిత్రలో ఈ-రూపీ ఆవిష్కరణ ఒక మైలురాయి అని, ఇది వాణిజ్య పరివర్తనకు దోహదపడుతుందని అన్నారు.