Dabur share price: డాబర్ షేర్లు 8 శాతం డౌన్.. టార్గెట్ ధర ఇదేనంటున్న నిపుణులు
Dabur share price: సెప్టెంబర్ త్రైమాసికం బలహీనంగా ఉంటుందని అంచనా రావడంతో డాబర్ షేర్లు 8 శాతం క్షీణించి మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా పానీయాల అమ్మకాలపై ప్రభావం పడిందని పేర్కొంటూ విశ్లేషకులు తమ టార్గెట్ ధరను సవరించారు.
సెప్టెంబర్ చివరి త్రైమాసికంలో ఆదాయం పడిపోతుందని కన్జ్యూమర్ గూడ్స్ తయారీ సంస్థ డాబర్ అంచనా వేయడంతో ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో డాబర్ షేరు 8 శాతం క్షీణించి మూడు నెలల కనిష్ట స్థాయి రూ. 571ను తాకింది. ఈ అంచనా విశ్లేషకులు స్టాక్ కోసం వారి టార్గెట్ ధరను తగ్గించడానికి దారితీసింది. ఇది మార్చి 2022 తర్వాత అతి పెద్ద కరెక్షన్‌గా మారింది.
క్యూ2 ఎఫ్వై 25లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వినియోగదారుల కొనుగోలు శక్తిని, వినియోగాన్ని ప్రభావితం చేసినందున సెప్టెంబర్ చివరి త్రైమాసికంలో ఆదాయం మిడ్ సింగిల్ డిజిట్ శాతం శ్రేణిలో పడిపోతుందని కంపెనీ మంగళవారం తెలిపింది.
ఈ కారణంగా తమ వ్యాపారంపై, ముఖ్యంగా బేవరేజ్ కేటగిరీలో కొంత ప్రభావం పడిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.
2024 మార్చితో ముగిసిన సంవత్సరానికి ఆహార, పానీయాల విభాగం మొత్తం ఆదాయంలో 14% వాటాను కలిగి ఉంది. భారతదేశంలో నైరుతి రుతుపవనాల వర్షపాతం ఈ సీజన్లో నాలుగు సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. ఇది దీర్ఘకాలిక సగటులో 108% నమోదై 934.8 మిల్లీమీటర్లుగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 868.6 మిల్లీమీటర్ల వర్షపాతం భారతదేశంలో దీర్ఘకాలిక సగటు.
ఏదేమైనా, తమ అంతర్జాతీయ వ్యాపారం టాప్ లైన్లో రెండంకెల స్థిర కరెన్సీ వృద్ధిని నమోదు చేస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ త్రైమాసికంలో మసాలా వ్యాపారం రెండంకెల వృద్ధితో మంచి పనితీరును కొనసాగించిందని తెలిపింది. క్యూ3 నుంచి వృద్ధి పుంజుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.
టార్గెట్ ధర తగ్గింపు
దేశీయ బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డాబర్ షేరు రేటింగ్‌ను 'కొనుగోలు' నుంచి సవరించి 'యాడ్' రేటింగ్‌కు డౌన్ గ్రేడ్ చేయడంతో పాటు టార్గెట్ ధరను రూ. 750 నుంచి రూ. 650కి తగ్గించింది.
"డాబర్ సాపేక్షంగా తక్కువ పనితీరు కనబరిచింది. ఇది సమీపకాలంలో కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడం, మెరుగైన శీతాకాల అమ్మకాల నేపథ్యంలో వ్యాపార రికవరీపై ఆశాభావం వ్యక్తం చేసున్నాం’ అని పేర్కొంది. గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ సిటీ కంపెనీ బిజినెస్ అప్డేట్ తర్వాత డాబర్ షేర్ల టార్గెట్ ధరను రూ. 570కి తగ్గించి, స్టాక్‌పై 'సెల్' రేటింగ్ కొనసాగించింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో డాబర్ ఇండియా అత్యంత బలహీనంగా ఉంటుందని ఇన్వెస్పెక్ అంచనా వేసింది. ఒక్కో షేరు టార్గెట్ ధర రూ. 638తో బ్రోకరేజీ సంస్థ ఈ షేరుపై 'హోల్డ్' రేటింగ్ ను కలిగి ఉంది.
ఎఫ్ఎంసీజీ రంగంలో డౌన్ స్టాకింగ్ దిద్దుబాట్లు అసాధారణమేమీ కానప్పటికీ, డాబర్‌పై ప్రభావం ఊహించని విధంగా ఉందని నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. బ్రోకరేజీ సంస్థ కొనుగోలు రేటింగ్ సిఫారసు చేస్తున్నప్పటికీ, డాబర్ ఇండియా స్టాక్ స్వల్పకాలంలో ఒత్తిడిని ఎదుర్కోవచ్చని పేర్కొంది.
(డిస్క్లైమర్: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకరేజీ సంస్థలవి, హిందుస్తాన్ టైమ్స్‌వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.)