Dabur India Q2 Results: తగ్గిన డాబర్ నికర లాభం.. మసాలా వ్యాపారంలోకి ఎంట్రీ
Dabur Q2 Results: డాబర్ ఇండియా కంపెనీ నికర లాభం 2.8 శాతం మేర తగ్గి రూ. 490.86 కోట్లుగా ప్రకటించింది. రెవెన్యూ 6 శాతం పెరిగింది.
Dabur Q2 Results: ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియా లిమిటెడ్ బుధవారం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.85% తగ్గి రూ. 490.86 కోట్లుగా నివేదించింది. క్రితం ఏడాది నికర లాభం రూ. 505.31.కోట్లుగా ఉంది. అయితే డాబర్ ఇండియా రెవెన్యూ 6% పెరిగింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రెవెన్యూ రూ. 2817.58 గా ఉండగా ఇప్పుడు రూ. 2986.49 కోట్లుగా ప్రకటించింది.
‘సవాళ్లో కూడిన ఆర్థిక వాతావరణం వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపింది. అయితే ఈ పండుగ సీజన్‌లో పరిస్థితి క్రమంగా పుంజుకుంటోంది. అధిక ధరల ప్రభావం గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా ఉంది. రానున్న క్వార్టర్లలో పరిస్థితి క్రమంగా పుంజుకుంటుందని భావిస్తున్నాం. ఈ త్రైమాసికంలో మరో 9 వేల గ్రామాలకు నెట్‌వర్క్ విస్తరించి మా కవరేజీ లక్ష గ్రామాలకు పెంచుకున్నాం..’ అని డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు.
డాబర్ అదనపు విలువను సృష్టించేందుకు కొత్త ఇన్వెస్ట్‌మెంట్లు చేపడుతోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, సుస్థిర వృద్ధి కోసం ప్రయత్నిస్తోంది. గత ఏడాది డాబర్ తన ఉత్పత్తుల విక్రయాల అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి 35 వేల మెట్రిక్ టన్నులను ప్రాసెసింగ్ చేసి రీసైక్లింగ్ చేసింది.
డాబర్ ఉత్పత్తుల్లో 95 శాతం తమ మార్కెట్ షేర్‌ను పెంచుకున్నాయి. పండ్ల రసాలు, నెక్టార్స్ సెగ్మెంట్‌లో డాబర్ ఉత్పత్తులు 410 బీపీఎస్ పాయింట్ల మేర మార్కెట్ షేర్‌ను పెంచుకున్నాయి. అలాగే చ్యవన్‌ప్రాశ్ 120 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటాను పెంచుకుంది. షాంపూ విభాగం 40 బేసిస్ పాయింట్ల మేర, హెయిర్ ఆయిల్స్ విభాగం 20 బేసిస్ పాయింట్ల మేర పెంచుకుంది.
డాబర్ ఆహార పదార్థాలు, పానీయాల విభాగం 30 శాతం వృద్ధిని సాధించింది. హోం కేర్ విభాగం 21 శాతం, టూత్ పేస్ట్ విభాగం 11 శాతం వృద్ధిని కనబరిచాయి. ఇక డాబర్ ఓవర్ ది కౌంటర్ ఆయుర్వేదిక్ ఉత్పత్తులు 9 శాతం, ఇంటర్నేషనల్ బిజినెస్ 12.3 శాతం వృద్ధి సాధించాయి.
కాగా మధ్యంతర డివిడెండ్ 250 శాతం మేర ఇచ్చేందుకు డాబర్ డైరెక్టర్స్ బోర్డు ఆమోదించింది. అంటే షేరుకు 2.50 చొప్పున డివిడెండ్ లభిస్తుందని డాబర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ మోహిత్ బర్మన్ తెలిపారు.
కాగా డాబర్ ఇండియా లిమిటెడ్ బాద్‌షా మసాలా ప్రయివేటు లిమిటెడ్‌లో 51 శాతం షేర్ హోల్డింగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా డాబర్ తన ఫుడ్ బిజినెస్ రూ. 500 కోట్లకు పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.
తాజా పరిణామంతో దాదాపు రూ. 25 వేల కోట్ల టర్నోవర్ ఉన్న మసాలా మార్కెట్లోకి డాబర్ ప్రవేశించినట్టయింది. రూ. 1,152 కోట్ల విలువ గల బాద్‌షా కంపెనీలో రూ. 587.52 కోట్లు వెచ్చించి 51 శాతం వాటా కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం మిగిలిన 49 శాతం వాటాను 5 ఏళ్ల తరువాత కొనుగోలు చేస్తుంది.