బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ కేంద్రాల విస్తరణ.. బేబీసైన్స్ ఐవీఎఫ్ కొనుగోలు-birla fertility invest 500 crores to further expands its network to 50 clinics by acquiring babyscience ivf ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ కేంద్రాల విస్తరణ.. బేబీసైన్స్ ఐవీఎఫ్ కొనుగోలు

బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ కేంద్రాల విస్తరణ.. బేబీసైన్స్ ఐవీఎఫ్ కొనుగోలు

Anand Sai HT Telugu
Aug 29, 2024 02:00 PM IST

Birla Fertility : బిర్లా ఫెర్టిలిటీ సంస్థ తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రాలను విస్తరించేందుకు సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ కేంద్రాల సంఖ్యను పెంచుకునే ఆలోచనలో ముందుకు వెళ్తుంది.

బేబీసైన్స్ ఐవీఎఫ్ కొనుగోలు చేసిన బిర్లా ఫెర్టిలిటీ
బేబీసైన్స్ ఐవీఎఫ్ కొనుగోలు చేసిన బిర్లా ఫెర్టిలిటీ

బిర్లా ఫెర్టిలిటీ ఇన్ వర్టో ఫెర్టిలైజేషన్ సంస్థ తమ సేవల విస్తరణపై కీలక ప్రకటన చేసింది. 12 బేబీ సైన్స్ ఐవీఎఫ్ క్లినిక్‌లను సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. దీంతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో తమ కేంద్రాలను విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. దీనికోసం దాదాపు రూ. 500 కోట్లు పెట్టుబడి కూడా పెట్టినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా బిర్లా ఫెర్టిలిటీ కేంద్రాల సంఖ్య 50కి చేరుకుంది. బిర్లా ఫెర్టిలిటీ సంస్థ 3 బిలియన్ డాలర్ల విలువ గల సీకే బిర్లా గ్రూప్‌లో భాగంగా ఉంది.

మూడు నెలల క్రితమే కేరళకు చెందిన ఏఆర్ఎంసీ ఐవీఎఫ్ సంస్థను కొనుగోలు చేసిన బిర్లా సంస్థ.. తాజాగా మరోసారి విస్తరణలో భాగంగా కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా బిర్లా ఫెర్టిలిటీ కేంద్రం వ్యవస్థాపకుడు అవంతి బిర్లా మాట్లాడుతూ, 'బిర్లా ఫెర్టిలిటీ సెంటర్ల విస్తరణ ఉద్దేశం చాలా గొప్పది. ఎన్నో జంటలకు, మహిళల ఆశయాలను సఫలీకృతం చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశాం. వ్యక్తిగతంగా రోగుల అవసరాలకు అనుగుణంగా చికిత్స చేసేందుకు అధునాతన పరికరాలను ఉపయోగిస్తాం. డయాగ్నోస్టిక్స్ చేసేందుకు అధునాతన పరికరాలు మా కేంద్రంలో ఉంటాయి. పేషెంట్‌కు తగ్గట్లుగా మెడిసిన్ ఇవ్వడంలోనూ జాగ్రత్త వహిస్తాం.' అని చెప్పారు.

సంతాన సాఫల్య ప్రయాణంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలకు అత్యాధునిక పరిష్కారాలను డాక్టర్లు అందించేందుకు కృషి చేస్తారని అవంతి బిర్లా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బేబీ సైన్స్ ఐవీఎఫ్‌ను భాగస్వామిగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంతానోత్పత్తిలో బేబీ సైన్స్ కేంద్రానికి కూడా పేరు ఉందని, తాము కొనుగోలు చేయడం గొప్ప విషయమని తెలిపారు.

'మా సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించాం. ప్రపంచ నైపుణ్యం, అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సంతానోత్పత్తి రేటును అందించడానికి మేం కృషి చేస్తున్నాం. గైనకాలజీ, పురుష సంతానోత్పత్తి చికిత్సలు, లాపోస్క్రోపీ విధానాలు, జన్యు స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్స్ మొదలైన సేవలను మేం అందిస్తున్నాం.' అని బిర్లా ఫెర్టిలిటీ ఛీఫ్ బిజినెస్ అధికారి అభిషేక్ అగర్వాల్ చెప్పారు.

ఈ ఒప్పందంపై సీకే బిర్లా హెల్త్ కేర్ వైస్ ఛైర్మన్ అక్షత్ సేత్ హర్షం వ్యక్తం చేశారు. సంతానోత్పత్తి సేవల్లో నమ్మకం కల్పించే కేంద్రంగా బిర్లా ఫెర్టిలిటీ ఐవీఎఫ్ విస్తరిస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో విస్తరించేందుకు ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని చెప్పారు. ఒక సంస్థగా ఎదిగేందుకు బేబీ సైన్స్ విలీనం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ప్రస్తుతం భారతదేశంలో 28 మిలియన్ల జంటలు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో 1 శాతం మంది కూడా సరైన వైద్య సేవలు పొందే స్థితిలో లేరు. అయితే ఐవీఎఫ్ విధానంతో సంతానోత్పత్తి సాధ్యమయ్యే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.

టాపిక్