భారతీయులు ఎక్కువగా చూస్తున్నది ఈ కార్ల వైపే.. టాప్ సిటీల్లో మూడింటిలో ఒకటి ఇదే
Automatic Cars In India : భారత్‌లో ఆటోమేటిక్ గేర్ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. జనాలు ఎక్కువగా ఈ కార్లవైపు మెుగ్గుచూపుతున్నారు. టాప్ సిటీల్లో మూడింటిలో ఒకటి ఆటోమేటిక్ కారేనని నివేదికలు చెబుతున్నాయి.
దశాబ్ద కాలంలో భారతీయ ఆటో రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఇటు కంపెనీలు కూడా కొత్త కొత్త కార్లను మార్కెట్‌లోకి వదులుతున్నాయి. ప్రజలు కూడా కొత్తగా వచ్చే వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆటోమెుబైల్ మార్కెట్ కలిగిన దేశం మనది. ఇతర దేశాల కంపెనీలు సైతం ఇక్కడ భారీగా మార్కెట్‌ను ఉపయోగించుకుంటాయి.
ఇటు చౌకైన కార్లు, అటు లగ్జరీ బ్రాండ్‌లకు ఇండియాలో డిమాండ్ ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో తయారైన కార్లు ఇక్కడకు దిగుమతి అవుతూ ఉంటాయి. మన కార్లు కూడా విదేశాలకు ఎగుమతి అవుతాయి. అయితే భారతదేశంలో అధికంగా అమ్ముడవుతున్న కార్లు ఏవో మీకు తెలుసా? ఆటోమేటిక్ కార్లు. అవును వీటికి రోజురోజుకు డిమాండ్ చాలా పెరుగుతోంది.
ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో అందుబాటులో ఉన్న ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో కూడిన చాలా కార్లు భారతదేశంలో కూడా ఉన్నాయి. ప్రధానంగా రెండు రకాల ట్రాన్స్మిషన్ కలిగిన కార్లు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ డిమాండ్ ఎక్కువ.
ఆటోమేటిక్ కార్ల పోటీ
ఆటోమేటిక్ గేర్ కార్లు మొదటి నుంచి వాడుతున్న మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లతో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం చాలామంది వీటివైపు మెుగ్గుచూపుతున్నారు. ఆటోమేటిక్ గేర్ ఉన్న కార్ల ధరలు రూ. 60,000 నుండి రూ. 2 లక్షల వరకు అధికంగా ఉంటాయి. అయినా కూడా భారతీయులు ఆటోమేటిక్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
మార్కెట్‌లో డిమాండ్
ఆటోమేటిక్ కార్లు 2020లో మొత్తం అమ్మకాలలో 16 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జాటో డైనమిక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. ఇప్పుడు భారతదేశంలోని మార్కెట్లో ఇది 26 శాతం వాటాను కలిగి ఉంది. టాప్ 20 నగరాల్లో విక్రయిస్తున్న మూడు కార్లలో ఒకటి ఆటోమేటిక్ కారు అని నివేదిక చెబుతుందంటే.. వీటి డిమాండ్ ఎంత అని అర్థం చేసుకోవచ్చు.
83 కారు మోడల్స్
ఇండియాలో టాటా మోటార్స్, మహీంద్రా, మారుతీ సుజుకి, టయోటా, హ్యుందాయ్, కియా వంటి కంపెనీల కార్లు ఆటోమేటిక్‌తో సహా పలు ట్రాన్స్‌మిషన్ ఎంపికలను అందిస్తున్నాయి. ఈ కంపెనీల నుంచి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో దేశీయ మార్కెట్లో 83 కార్ మోడల్స్ ఉన్నాయి.
ఇక స్థానికంగానే!
ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి ఇప్పుడు 83 కార్ మోడల్‌లు అందుబాటులో ఉన్నాయంటే వీటి డిమాండ్ ఎలా ఉందో అర్థమవుతుంది. రోజురోజుకు వీటి డిమాండ్ ఇంకా పెరుగుతుంది. మరోవైపు చాలా కార్ కంపెనీలు తమ కార్లలో ఎక్కువ భాగం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో దిగుమతి చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో డిమాండ్ ఆధారంగా ఇక్కడ ఎక్కువ ఆటోమేటిక్ కార్లే తయారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతీ సుజుకి, మహీంద్రా వంటి కొన్ని ప్రధాన వాహన తయారీ సంస్థలు ఈ కార్లను స్థానికంగా తయారు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆటోమేటిక్ కార్లకు మరింత డిమాండ్ పెరగనుంది. దానికి తగ్గట్టుగా కంపెనీలు సైతం ప్రణాళికలు వేసుకుంటున్నాయి.