Health Insurance : మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి 4 సాధారణ కారణాలు-4 common reasons why your health insurance claim get rejected avoid these mistakes ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Health Insurance : మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి 4 సాధారణ కారణాలు

Health Insurance : మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి 4 సాధారణ కారణాలు

Anand Sai HT Telugu
Sep 10, 2024 06:00 PM IST

Health Insurance : చాలా మందికి ఆరోగ్య బీమా పాలసీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనిని క్లెయిమ్ చేస్తారు. కొంతమందికి క్లెయిమ్ వస్తే మరికొందరిది తిరస్కరణకు గురవుతుంది. ఇలా అయ్యేందుకు కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హెల్త్ ఇన్సూరెన్స్ టిప్స్
హెల్త్ ఇన్సూరెన్స్ టిప్స్ (MINT_PRINT)

చాలా మంది ఊహించని వైద్య ఖర్చులను నివారించడానికి ఆరోగ్య బీమా తీసుకుంటారు. అటువంటి ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తులు కొన్నిసార్లు క్లెయిమ్ రాక ఇబ్బంది పడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవడం, వాటిని ముందుగానే సరిదిద్దడం ముఖ్యం. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు సాధారణంగా ఎందుకు తిరస్కరిస్తారో చూద్దాం..

అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చుల కోసం చాలా మంది ఆరోగ్య బీమా తీసుకుంటారు. కానీ సరైన సమయంలో అవి అందుబాటులోకి రాకపోతే ప్రయోజనం ఉండదు. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎందుకు తిరస్కరణకు గురవుతాయో తెలుసుకోవాలి.

సరైన సమాచారం లేకపోవడం

వయస్సు, ఆదాయం, ఇప్పటికే ఉన్న వైద్య బీమాలు, వృత్తి వివరాలు మొదలైనవి తప్పుగా పేర్కొనడం వలన మీ క్లెయిమ్ తిరస్కరణకు గురి కావొచ్చు.

ముందుగా ఉన్న వ్యాధులను చెప్పకపోవడం

ముందుగా ఉన్న వ్యాధులు, మీ కుటుంబ వైద్య చరిత్ర, ధూమపానం, మద్యపానం గురించి వెల్లడించకుండా ఉంటే కూడా క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. ఎందుకంటే కొన్ని పాలసీలు కొన్ని చికిత్సలను కవర్ చేయవు. మీ పాలసీ కవరేజీ ఎంత? అది మీకు తెలియాలి. అలాగే మీకు ఇప్పటికే ఉన్న వ్యాధుల వివరాలను కూడా స్పష్టంగా పేర్కొనాలి.

గడువు తేదీ

ప్రతి పాలసీకి నిర్దిష్ట గడువు తేదీ ఉంటుంది. బీమా కంపెనీలు సాధారణంగా ఒక సంవత్సరం గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. తర్వాత మీ పాలసీని రెన్యూవల్ చేయకపోతే అది నిరుపయోగంగా మారుతుంది. గడువు తేదీకి ముందే దాన్ని పునరుద్ధరించడం ముఖ్యం. ప్రతి బీమా పాలసీకి క్లెయిమ్ సమాచారం కోసం నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. ఈ గడువును చేరుకోవడంలో విఫలమైతే బీమాదారు క్లెయిమ్ తిరస్కరిస్తారు.

అసంపూర్ణ అభ్యర్థన

మీరు మీ మొత్తం సమాచారాన్ని కచ్చితంగా పూరించాలి. ఫారమ్‌లలో ఏదైనా సమాచారం మరిచిపోయినా లేదా తప్పుగా నింపినా మీ క్లెయిమ్ తిరస్కరిస్తారు.

అందుకే ఏదైనా బీమా పాలసీ తీసుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరో విషయం ఏంటంటే చాలా మంది ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి బీమాను క్లెయిమ్ చేస్తుంటారు. ఇలాంటి పనులు చేసి దొరికిపోతే మీరు శిక్షకు కూడా అర్హులే.