World Telugu Writers Conference : విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సభలు-world telugu writers association 5th conference in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  World Telugu Writers Conference : విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సభలు

World Telugu Writers Conference : విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సభలు

HT Telugu Desk HT Telugu
Sep 24, 2022 08:34 AM IST

World Telugu Writers Conference విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సమావేశాలను నిర్వహించేందుకు నిర్వాహకులు తేదీలను ఖరారు చేశారు. డిసెంబర్‌ 23, 24 తేదీల్లో ఈ మహాసభలు విజయవాడలో నిర్వహించనున్నారు.

విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

World Telugu Writers Conference ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విజయవాడ మరోసారి వేదిక కానుంది. మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్ర- కర్తవ్యం, కార్యాచరణ లక్ష్యాలుగా 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించనున్నారు. విజయవాడలోని పి.బి.సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి తెలుగు రచయితలు, సాహితీ అభిమానులు తరలిరావాలని మహాసభల గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ కోరారు.

కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్వహణలో World Telugu Writers Conference మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. కర్తవ్యం- కార్యాచరణ లక్ష్యంగా సాగే ఈ సభల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు రచయితలు, తమ ప్రతిభాపాటవాలతో రాణిస్తున్న సాహితీ మూర్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయిలో తెలుగు రచయితలు ఒకచోట సమావేశమై చేసే నిర్ణయాల ప్రభావం తప్పకుండా ప్రజల్ని చేరతాయని నిర్వాహకులు తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సభలకు రచయితలు, సాహిత్యాభిమానులు 2022 అక్టోబర్‌ 31లోగా రూ.500ల చొప్పున ప్రతినిధి రుసుం కింద చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. సదస్సుకు హాజరయ్యే వారు తమ చెల్లింపులను 9391238390 నంబర్‌కు ఫోన్‌ ద్వారా పంపవచ్చని మండలి బుద్దప్రసాద్‌ సూచించారు. ప్రతినిధులకు నిర్వాహకులు భోజన వసతి కల్పిస్తారు. మహాసభల్లో ప్రతినిధులకు మాత్రమే సదస్సులు, కవి సమ్మేళనాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సమయానుకూలతను బట్టి సభావేదికలపై ప్రతినిధులు తమ రచనలు ఆవిష్కరించుకొనేలా వెసులుబాటు కల్పిస్తారు. గతంలో 2007, 2011, 2015, 2019 సంవత్సరాల్లో World Telugu Writers Conference రచయితల ప్రపంచ మహాసభలు ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగాయి.

భాషా సాంస్కృతిక, సామాజిక విలువలు పతనం అంచున నడుస్తోన్న ఈ సమయంలో రచయితలను సమాయత్తం చేయడానికి ఈ సభలు ఉపకరించనున్నాయని మండలి బుద్ధప్రసాద్‌, రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు తెలిపారు. రచయితలు, సాహిత్యాభిమానులు ప్రపంచ సమావేశాలకు తరలిరావాలని.. మరిన్ని వివరాలకు 9391238390 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్