Somu Veerraju : రాజధాని విషయంలో జగన్ మొద్దు నిద్ర…. సోము వీర్రాజు
Somu Veerraju ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముక్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర పోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో ఉన్న యూనివర్శిటీ లు, రవాణా మార్గాలలో మౌలిక వసతులను పరిశీలించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Somu Veerraju అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రముఖ విద్యా సంస్థలకు కనీసం రోడ్డు సదుపాయం కూడా కల్పించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాలలో ఉన్న అమృత, విట్, SRM యూనివర్శిటీలను సోము వీర్రాజు పరిశీలించారు. దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ఈ యూనివర్శిటీ లలో అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుతున్నారని, వారికి కనీస రవాణా సదుపాయాలు లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ఎపి ప్రభుత్వం పై ఉందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఇతర రాష్ట్రాలు, దేశాలలో మన రాష్ట్రం గురించి ఏమనుకుంటారో కూడా ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం లేదని విమర్శించారు. తోలు మందం ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోదని దుయ్యబట్టారు. పదకొండు కిలోమీటర్ల ఉన్న రోడ్‌ను డబుల్ లైన్ గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన యూనివర్శిటీలపై కూడా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇటు వంటి చర్యలు వెంటనే నిలిపివేయాలన్నారు.
కేవలం రెండు కోట్లు వ్యయం అయ్యే రోడ్ల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ కి వచ్చే ఒక్క రోడ్ కూడా బాగోలేదని, అన్నీ తెలిసినా జగన్ మొద్దు నిద్ర పోతున్నాడని ఆరోపించారు. ఇక్కడే రాజధాని అని అధికారంలోకి వచ్చి మాట తప్పి, మడమతిప్పాడని, పరిపాలన వికేంద్రీకరణ అంటే అసలు జగన్ కి అర్దం తెలుసా అని ప్రశ్నించారు.
విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్లు నిధులు ఇచ్చిందని, విజయనగరం నుంచి చత్తీస్‌గఢ్ వరకు నాలుగు రోడ్లు విస్తరిస్తున్నామని, నాలుగు లైన్లను కలిగిఆరు లైన్ల రహదారి గా అభివృద్ధి చేశామని చెప్పారు. అదే సమయంలో జగన్ విశాఖకు చేసిందేమీ లేదని, ఆయన ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల ల్లో ఏమిచేశారో చెప్పాలని బిజెపి సవాల్ చేస్తుందన్నారు. అమరావతి రైతులు యాత్ర చేస్తుంటే కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు. బిజెపి రైతుల ఉద్యమానికి అండగా ఉంటుందని, టిడిపి, వైసిపి ప్రభుత్వాల వల్లే నేడు వాళ్లు రోడ్ఢక్కాల్సి వచ్చిందన్నారు. జగన్ 11కి.మి రోడ్డు కూడా వేయలేక పోయాడని, మోడీ ఐకాన్ బ్రిడ్జి వేస్తున్నారని, కోడూరు, మేదరమెట్ల రోడ్ కు టెండర్లు పిలిచారని చెప్పారు.
ఏపిలో అనేక వంతెనలు, జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నారని, ఫొటోలకు ఫోజులిచ్చే జగన్ కు.. రోడ్లు వేసే దమ్ము లేదని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. విజయవాడ లో మూడు ఫ్లైఓవర్లు, ఎయిమ్స్ కేంద్రం కట్టిందని జగన్ ఏం చేశాడో జనానికి చెప్పాలన్నారు. జగన్ కు దమ్ముంటే.. యూనివర్శిటీల వైపు వెళ్లే రోడ్లు వేయాలన్నారు.
పోటీ ఉద్యమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, వైసీపీకిఅభివృద్ధి పట్టదని, విద్వేషాలు రెచ్చ గొట్టడమే జగన్ విధానమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము జగన్ కి ఉందా అని ప్రశ్నించిన సోము వీర్రాజు ప్రజలను పక్కదారి పట్టించే ఉద్యమాలను జగన్ మానుకోవాలని హితవు పలికారు.