Pawan Kalyan : సీమ నుంచే ముఖ్యమంత్రులు ఎక్కువ.. అయినా వెనకబడే ఉంది-pawan kalyan comments on ysrcp govt over visakhapatnam issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : సీమ నుంచే ముఖ్యమంత్రులు ఎక్కువ.. అయినా వెనకబడే ఉంది

Pawan Kalyan : సీమ నుంచే ముఖ్యమంత్రులు ఎక్కువ.. అయినా వెనకబడే ఉంది

HT Telugu Desk HT Telugu
Oct 17, 2022 09:33 PM IST

Janasena Pawan Kalyan Comments : వైసీపీ నుంచి ఏపీని విముక్తి చేయడమే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదనేది తన ఆశయమని చెప్పారు.

మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్
మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్

విశాఖ(Visakha)లో తనను రెచ్చగొట్టారని పవన్ కల్యాణ్ అన్నారు. గొడవ జరిగేలా చేయాలని చూశారన్నారు. కానీ సంయమనంతో వ్యవహరించానని పవన్(Pawan Kalyan) చెప్పారు. విశాఖ నుంచి విజయవాడ(Vijayawada) చేరుకున్న తర్వాత.. పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనను ఎంత రెచ్చగొట్టినా.. సంయమనంతో వ్యవహరించానని చెప్పారు.

'ఐఏఎస్‌, ఐపీఎస్‌లు క్రిమినల్స్‌కు సెల్యూట్‌ చేసే వ్యవస్థ ఉండడం దారుణం. రాజకీయాల్లో క్రిమినల్స్​ ఉండకూడదనేది నా ఆశయం. వైసీపీ(YSRCP) నుంచి ఏపీని విముక్తి చేయటమే నా లక్ష్యం. వైసీపీ విముక్తి కోసం వచ్చే ఎన్నికల్లో పోరాడతాం. రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదనేదే వైసీపీ ఉద్దేశం. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే మేం జనవాణి(Janavani) ప్రకటించామనడం సరికాదు. వైసీపీ కార్యక్రమానికి ఇబ్బంది కలిగించాలనడం మా ఉద్దేశం కాదు. ఇతర పార్టీలను భయపెట్టి అదుపులో ఉంచాలనుకుంటున్నారు.' అని పవన్ అన్నారు.

పార్టీ సంస్థాగత నిర్మాణం కోసమే పర్యటనలు చేస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అధికార పార్టీ గర్జించడమేంటని అడిగారు. మంత్రుల వాహనాలపై దాడి జరిగితే.. పోలీసు(Police)లు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎయిర్ పోర్టులో కోడికత్తి(Kodikatthi) ఘటనపై చర్యలు లేవని విమర్శించారు. వైసీపీ వాళ్లు దాడులు చేసినా.. పోలీసు కేసులు ఉండవన్నారు. వైసీపీ నేతల భూకబ్జాలు బయటపడతాయనే ఉద్దేశంతో జనవాణి కార్యక్రమం జరగనీయలేదని పవన్ ఆరోపించారు.

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దసపల్లా భూములు(Daspalla Lands) ప్రైవేటు వ్యక్తులు చేతిలోకి ఎలా వెళ్లాయి. ఉత్తరాంధ్ర(Uttarandhra)పై ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే మాజీ సైనికులకు 71 ఎకరాల భూమిని ఎందుకు ఆక్రమించారు. ఏపీకి రాయలసీమ నుంచే ఎక్కువ ముఖ్యమంత్రులు వచ్చారు. అయినా ఆ ప్రాంతం వెనకబడే ఉంది. అధికారం ఒక కుటుంబం చేతిలో పెట్టుకుని.. అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం.

- పవన్ కల్యాణ్

పోలీసుల వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచన లేదని పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. ఎవరి యుద్ధం వారే చేయాలనేది బీజేపీ(BJP) పెద్దల మనస్తత్వమని తనకు తెలుసని పవన్ వ్యాఖ్యానించారు. అందుకే ఇక్కడే ఉండి తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఏపీలో ఉండే పోరాటం చేస్తానన్నారు. తెలుగు నేలను కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని కోరారు.

IPL_Entry_Point