Janasena Leaders Arrest : విశాఖలో జనసేన నాయకుల అరెస్ట్….
Janasena Leaders Arrest విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులపై దాడులు చేశారనే ఆరోపణలపై పలువురు జనసేన నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తిరుగు ప్రయాణాలకు విమానాశ్రయానికి వెళ్తుండగా జనసేన కార్యకర్తలు వాహనాలపై దాడులు చేశారు. ఈ ఘటనపై పోలీసులు పలువురు నాయకుల్ని అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Janasena Leaders Arrest విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు, వైకాపా నాయకులపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రుల వాహనాలపై దాడులకు జనసేన నాయకులను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కోన తాతారావు, పీతల మూర్తియాదవ్, విశ్వక్‌సేన్, సుందరపు విజయ్‌కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్‌రెడ్డి, పీవీఎస్‌ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, కీర్తి, పాలవసల యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజును పోలీసులు అరెస్టు చేశారు.
Janasena Leaders Arrest విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి యత్నించినవారిని గుర్తించి సెక్షన్ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మంత్రి రోజా, తదితర వైకాపా నాయకులు విమానాశ్రయానికి వచ్చినపుడు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వారిని దూషించి, రాళ్లతోనూ, పార్టీ జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విమానాశ్రయంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కూడా జరిగిందని తెలిపారు.
ఆదివారం విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నోవాటెల్‌ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన ఫ్లోర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పవన్ బస చేసిన హోటల్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఏసీపీ హర్షిత చంద్ర ఆధ్వర్యంలో హోటల్ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. హోటల్ వద్ద భద్రత ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, క్రైమ్ డీసీపీ నాగన్న పరిశీలించారు.
నోవాటెల్ హోటల్‌లో పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా బస చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో హోటల్ పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో జనసంచారం లేకుండా పహారా కాస్తున్నారు. నోవాటెల్ వైపు వచ్చే కార్యకర్తలు, అభిమానులను అడ్డుకుంటున్నారు. పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
నోవాటెల్ హోటల్‌లో సోదాలు నిర్వహించి జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, పి.వి.ఎస్.ఎన్. రాజు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ విశ్వక్సేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్, పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య, వాసులను అరెస్టు చేశారు.
విమానాశ్రయంలో దాడిపై పోలీసుల సీరియస్….
విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. వైసీపీ మద్దతుతో జేఏసీ శనివారం విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు రాష్ట్ర మంత్రులపై దాడులకు ప్రయత్నించారు. కర్రలు, వాటర్ బాటిళ్లు, చెప్పులు విసిరారు. మంత్రుల భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారిపై కూడా దాడి చేసినట్లు చెబుతున్నారు.
'విశాఖ గర్జన' కార్యక్రమాన్ని ముగించుకుని విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి విడివిడిగా చేరుకున్న మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, రోజా, విడదల రజని.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడులకు దిగారు.
ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న చెత్తకుండీపైనున్న స్టీల్ మూతతో దాడిచేయగా మంత్రి రోజా వ్యక్తిగత సిబ్బందిలోని ఒకరి తలకు బలంగా గాయమైంది. దీంతో 15 నిమిషాల పాటు విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని మంత్రులను సురక్షితంగా ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లారు. జనసేన కార్యకర్తల దాడులతో విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, అదనపు కమిషనర్ ఆనందరెడ్డి విమానాశ్రయానికి చేరుకుని విచారణ చేపట్టారు.