AP Skill Development Scam : 'ఆ స్కాంలో చంద్రబాబు, లోకేశ్ అరెస్టు కావాల్సి ఉంది'
AP Skill Development Scam : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి కలిపించే.. ముసుగులో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) 371 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి గుడివాడ అమర్నాథ్(minister gudivada amarnath) ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు, లోకేశ్(Lokesh) జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు నైపుణ్యతకు ఉదాహరణ అని చెప్పారు. ఒక ప్రైవేటు సంస్థ 90 శాతం నిధులు ఎలా కేటాయిస్తుందనే అనుమానం ఎవరికైనా వస్తుందని అమర్నాథ్ అన్నారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు.. తన జేబులో వేసుకున్నారని ఆరోపించారు. 'యూరో లాటరీల మాదిరిగా టీడీపీ(TDP) హయాంలో షెల్ కంపెనీలతో కలిసి సింగపూర్ కేంద్రంగా స్కాం జరిగింది. సీమెన్స్ సంస్థకు లేఖ రాస్తే అంత తక్కువ పెట్టుబడికి అంత ఎక్కువ ఎలా పెడతామని సమాధానం ఇచ్చారు. డిజైన్ టెక్ కంపెనీకి రూ. 185 కోట్ల సింగిల్ ట్రాన్స్‌ఫర్ జరిగింది. చంద్రబాబు ఆదేశాలతో నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రిన్పిపల్ సెక్రటరీ స్వయంగా జీవో విడుదల చేశారు.' అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో(Skill Development Scam) సింగపూర్ కు చెందిన స్కిల్లర్, ఇన్ వెబ్ సొల్యూషన్స్ వంటి ఆరు షెల్ కంపెనీలు చూపించారని, ఇందులో భాగంగా 371.25 కోట్ల రూపాయలను ఆయా కంపెనీలకు చంద్రబాబు తరలించారని అమర్నాథ్ అన్నారు. స్కిల్లర్ కంపెనికి 185 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఈ కంపెనీలకు డబ్బులు బదిలీ చేసి.. కీలక పత్రాలను మాయం చేశారని మంత్రి ఆరోపించారు.
'రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్(Hyderabad) చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. యువతకు అవసరమైన నైపుణ్యాన్ని కల్పించనున్నట్టుగా అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాయ మాటలు చెప్పి సీమెన్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం ఆరు క్లస్టర్లని ఏర్పాటు చేస్తున్నట్లు, ఒక్కో క్లస్టర్ కు 560 కోట్ల రూపాయల చొప్పున సుమారు 3,300 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని ప్రకటించారు. పది శాతం అంటే సుమారు 370 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన 90 శాతం మొత్తాన్ని సీమెన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు క్యాబినెట్లో ప్రకటించారు.' అని అమర్నాథ్ అన్నారు.
ఏలేరు స్కామ్ లో కూడా చంద్రబాబు పాత్ర అందరికీ తెలుసని అమర్నాథ్(amarnath) ఆరోపణలు చేశారు. స్టాంపుల కుంభకోణంలోనూ హస్తం ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం దేశంలోనే అతి పెద్దది అని, చంద్రబాబు, లోకేశ్ అరెస్టు కావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే.. స్కాం బయటపడుతుందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నామని, తమకేం కాదని చంద్రబాబు అనుకున్నారని.. కానీ దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాయని తెలిపారు.
ఇదే కేసులో ఇప్పటికే పది మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టుగా మంత్రి అమర్నాథ్ చెప్పారు. ప్రభుత్వంతో సీమెన్స్ సంస్థ ఒప్పందంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీశాయని, కానీ అటువటి ఒప్పందం ఏమీ తాము కుదుర్చుకోలేదని.. సీమెన్స్ యాజమాన్యం తెలిపిందన్నారు.
సంబంధిత కథనం