SummerHeat | ఏపీలో భానుడి భగభగ... మరో మూడ్రోజులు ఇంతే....!-heat waves alert for andhrapradesh by disaster management authority ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Summerheat | ఏపీలో భానుడి భగభగ... మరో మూడ్రోజులు ఇంతే....!

SummerHeat | ఏపీలో భానుడి భగభగ... మరో మూడ్రోజులు ఇంతే....!

HT Telugu Desk HT Telugu
Jun 03, 2022 07:01 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరడంతో జనం ఎండ వేడ తాళలేకపోతున్నారు. అమరావతి, గన్నవరం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలను దాటడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.

ఎండ వేడిని తాళలేక నీళ్లు గుమ్మరించుకుంటున్న యువకుడు
ఎండ వేడిని తాళలేక నీళ్లు గుమ్మరించుకుంటున్న యువకుడు (Himanshu Sharma)

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించినా ఏపీలో భానుడి భగభగలు ఏ మాత్రం తగ్గలేదు. మరికొన్ని రోజుల పాటు వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేసవి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో వాతావరణం భరించలేని విధంగా తయారైంది. కృష్ణా,గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. 81మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం ఆత్రేయపురంలో అత్యధికంగా 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంపచోడవరం, కుక్కునూరు, ఉంగుటూరు, ఐపోలవరం, వాలారిపాడులలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

శుక్రవారం 83మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 157మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నివారణ శాఖ సూచిస్తోంది. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47డిగ్రీలకు చేరనున్నాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీలకు చేరుతాయి. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 43 డిగ్రీల నుంచి 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. విశాఖపట్నం, కడప, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, నంధ్యాల, కర్నూలు జిల్లాల్లో 40-42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.

శనివారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కానుంది. పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, నెల్లూరు, కడప జిల్లాల్లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

IPL_Entry_Point

టాపిక్