YSRCP : కుప్పం నుంచే వైసీపీ గెలుపు మొదలు కావాలన్న జగన్-andhra pradesh cm jagan concentrates on tdp presidents assembly segment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp : కుప్పం నుంచే వైసీపీ గెలుపు మొదలు కావాలన్న జగన్

YSRCP : కుప్పం నుంచే వైసీపీ గెలుపు మొదలు కావాలన్న జగన్

HT Telugu Desk HT Telugu
Aug 05, 2022 06:42 AM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కుప్పం నియోజక వర్గం నుంచే మొదలు కావాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. కుప్పం నియోజక వర్గ నేతలతో భేటీ సందర్భంగా కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న నియోజక వర్గాల వారీ సమీక్షలు ప్రారంభించారు. కార్యకర్తలతో చర్చించడం ద్వారా క్షేత్ర స్థాయి పరిస్థితుల్ని

కుప్పం కార్యకర్తలతో మాట్లాడుతున్న సీఎం జగన్
కుప్పం కార్యకర్తలతో మాట్లాడుతున్న సీఎం జగన్

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పని ఏడాది లోపు పూర్తి చేసి కుప్పంకు కృష్ణా జలాలను తరలస్తామని కుప్పం నేతలకు ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కంటే కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడే ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని, త్వరలో కుప్పం మునిసిపాలిటీకి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కుప్పం నియోజక వర్గ వైసీపీ బాధ్యుడు భరత్‌ కోరడంతోనే ముఖ్యమంత్రి జగన్‌గా తాను నిధులు కేటాయిస్తున్నానని సీఎం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో 175కు 175 నియోజక వర్గాల్లో వైఎస్సార్‌సీపీ గెలవాలని, వైసీపీ గెలుపు కుప్పం నుంచే ప్రారంభం కావాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన జగన్, ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేశారు. కుప్పంను తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా కుప్పంలో పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసిందని గుర్తు చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించి, ఆశీర్వదించారన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని, ప్రతి ఇంటిలో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి కన్పిస్తోందన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాలరెగరేసుకుని ఇంటింటికీ వెళ్లి, వారికి మంచి చేశామా, లేదా అని అడిగే స్థాయిలో పనులు చేశామన్నారు. ప్రజల ఆశీస్సులను ఓట్ల రూపంలోకి మార్చే బాధ్యత మీదేనని కార్యకర్తలకు నిర్దేశం చేశారు. కుప్పంలో ‘మూడేళ్లుగా భరత్‌ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడని భరత్‌కు ఒక్కసారి తోడుగా నిలబడి గెలిపించుకుని వస్తే మంత్రిని చేస్తానని, కుప్పం అభివృద్ధికి మరింతగా ఉపయోగపడతాడు’ అని కార్యకర్తలకు చెప్పారు.

బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం కుప్పంకు చంద్రబాబు నియోజక వర్గమని అంతా అనుకుంటారని కాని దానికి ఆయన ఏమి చేయలేదని ఎద్దేవా చేశారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డు ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి ముందుకు వెళ్లామని దురదృష్టవశాత్తు ఆయన దూరమయ్యారని చెప్పారు. ఆ కుటుంబాన్ని వదిలేయకుండా, ఆయన కుమారుడు భరత్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చామని సీఎం చెప్పారు.

కుప్పంను తన నియోజకవర్గంగానే చూస్తానని, అన్ని రకాలుగా మద్దతు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 నియోజక వర్గాల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కుప్పంలో టీడీపీని ఓడించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో ఓడించడం ద్వారా టీడీపీని బలహీనపర్చాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది.

IPL_Entry_Point

టాపిక్