TS Rains : వామ్మో ఇవేం వానలు.. జర పైలం.. ముత్తారంలో అత్యధిక వర్షపాతం
Telangana Rains : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎటూ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది.
తెలంగాణలో(Telangana Rains) మూడు రోజులు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా వానలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, మరోవైపు ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు జిల్లాల్లో మాత్రం.. ఆకాశానికి చిల్లు పడినట్టుగా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. జులై చరిత్రలోనే ఎప్పుడూ లేనంత వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 35 సెంటిమీటర్ల వర్షం పడింది.
మరో రెండు, మూడు రోజులపాటు.. వర్షాలు(Rains) విపరీతంగా కురవనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. తెలంగాణాలో ఇలానే వర్షపాతం కొనసాగితే.. పలు జిల్లాల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు(Hyderabad Rains) విపరీతంగా పడుతున్నాయి.
జులై 10వరకు తెలంగాణలో సరాసరి వర్షపాతం 19.7 సెంటిమీటర్లుగా ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 36.6 సెంటిమీటర్ల సరాసరి వర్షపాతంగా నమోదైంది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలోనూ.. కురవాల్సిన దానికంటే ఎక్కువగానే వర్షాలు పడ్డాయి. మహబూబా బాద్ జిల్లాలో ఏకంగా 126 శాతం అధిక వర్షం కురిసింది. భూపాలపల్లిలో 122 శాతం వర్షం పడింది. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం జిల్లాలో కురవాల్సిన దాని కంటే ఎక్కువగానే వానలు పడ్డాయి. ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు వంద శాతం అధిక వర్షం పడింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ.. ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
మరోవైపు ఇప్పటికే ప్రాజెక్టులకు వరద నీరు పొటెత్తుతోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు(Sriram Sagar Project Floods) ఎగువ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్సారెస్పీ గేట్లు తెరిచే ఆలోచనలో అధికారులు ఉన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు సైతం వరద నీరు భారీగా వస్తోంది. భద్రాచలంలోనూ గోదావరి( Bhadrachalam Godavari River) వరద క్రమంగా పెరుగుతోంది. 43 అడుగలకు నీటిమట్టం చేరుకునే అవకాశం ఉందని.. ఏ క్షణంలోనైనా.. మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో వరదల నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సమీక్షా సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సి చర్యలపైన సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి. అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్ కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు