MIdnight Blasts: అర్ధరాత్రి బాంబు పేలుళ్లు.. పరుగులు పెట్టిన గ్రామస్తులు
MIdnight Blasts: మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్స్ కలకలం రేపుతున్నాయి. గూడూరు మండలం పొనుగోడులో స్టోన్ క్రషర్ లో తవ్వకాల కోసం బాంబులు పేలుస్తుండటంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
MIdnight Blasts: జనలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో బాంబుల మోత మోగించడం, ఆ ధాటికి ఇళ్లు దెబ్బతిని బీటలు వారుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని వాపోతున్నారు. తాజాగా బుధవారం అర్ధరాత్రి కూడా ఇలాగే పొనుగోడు శివారులోని క్రషర్ లో బాంబు బ్లాస్టింగ్స్ చేయగా.. సమీపంలోని గాజులగట్టు గ్రామం దద్దరిల్లింది.
బాంబుల ధాటికి దాదాపు 25 ఇళ్లు దెబ్బతిని గోడలు నెర్రలుబాయగా.. ఒక్కసారిగా భూకంపం వచ్చిందంటూ గ్రామంలోని జనాలు వెంటనే రోడ్ల మీదకు పరుగులు తీశారు. అనంతరం పేలుళ్లకు పాల్పడుతున్న స్టోన్ క్రషర్ నిర్వాహకులు, వర్కర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో బుధవారం అర్ధరాత్రి ఓ క్రషర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పేలుళ్లతో గ్రామానికి ముప్పు
స్టోన్ క్రషర్లలో పేలుళ్లు జరుపుతుండటంతో గాజులగట్టు గ్రామస్థులు ఇదివరకు పలుమార్లు సంబంధిత యజమానుల దృష్టికి తీసుకెళ్లారు. పేలుళ్ల వల్ల తమ గ్రామానికి ముప్పు ఏర్పడుతోందని, బ్లాస్టింగ్స్ జరపకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా తమకు పర్మిషన్ ఉందన్న పేరుతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన బ్లాస్టింగులకు పెద్ద పెద్ద రాళ్లు ఎగిరొచ్చి రోడ్ల మీద పడ్డాయి.
పేలుళ్లకు భూమి అదరడంతో అక్కడ భూకంప వాతావరణం ఏర్పడింది. దీంతో గాజులగుట్టలోని దాదాపు 25 ఇళ్లు దెబ్బతిన్నాయి. నెర్రలుబారి ప్రమాదకరంగా మారాయి. దీంతో ఆయా ఇండ్లలోని కుటుంబాలు ఉలిక్కిపడి లేచి, పరుగులు పెట్టాయి. భూకంపం వస్తోందన్న భయంతో పిల్లాజెల్లలతో కలిసి ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ రోడ్ల మీదకు చేరారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
పంటలకూ తీవ్ర నష్టం
ఇష్టారీతిన పేలుళ్లు జరుపుతుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని గాజులగట్టు గ్రామస్థులు వాపోతున్నారు. బ్లాస్టింగుల కారణంగా పెద్ద పెద్ద రాళ్లు ఎగిరివచ్చి పడుతున్నాయని, ఆ మార్గంలో రాకపోకలు సాగించాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా బ్లాస్టింగుల వల్ల ఇళ్లతో పాటు పంటపొలాలు కూడా తీవ్రంగా దెబ్బ తింటున్నాయని, మిర్చి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని వాపోయారు. అంతేగాకుండా బ్లాస్టింగుల వల్ల దుమ్ము, ధూళితో రోగాల బారిన పడుతున్నామని, సమస్య తీవ్రంగా ఉన్నా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
స్టోన్ క్రషర్ వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు రూల్స్ కు విరుద్ధంగా బ్లాస్టింగులకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు పట్టించుకోకుండా వదిలేస్తున్నారన్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరిపైనా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది స్టోన్ క్రషర్ యజమానులు ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని, బ్లాస్టింగులకు పాల్పడుతూ ఊళ్లను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో గ్రామమంతా ఏకమై పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు.
(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)