TSRTC Smart Cards: ఇకపై 'స్మార్ట్'గా ఆర్టీసీ ప్రయాణం.. ఫోన్ లోనే బస్ పాసులు!-tsrtc to launch smart card system soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Smart Cards: ఇకపై 'స్మార్ట్'గా ఆర్టీసీ ప్రయాణం.. ఫోన్ లోనే బస్ పాసులు!

TSRTC Smart Cards: ఇకపై 'స్మార్ట్'గా ఆర్టీసీ ప్రయాణం.. ఫోన్ లోనే బస్ పాసులు!

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 11:29 AM IST

TSRTC Smart cards: టిక్కెట్లు, పాసుల జారీలో స్మార్ట్‌ శకానికి శ్రీకారం చుట్టనుంది తెలంగాణ ఆర్టీసీ. చిన్న చిన్న చిక్కుముడులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.

తెలంగాణలో ఆర్టీసీలో కొత్త విధానం
తెలంగాణలో ఆర్టీసీలో కొత్త విధానం

TSRTC to Launch Smart Card System: టీఎస్ఆర్టీసీ... గత కొద్దిరోజులుగా వినూత్న ఆలోచనలతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే ప్రయత్నం చేస్తోంది. పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. టూరిజం ప్యాకేజీలను కూడా అందుబాటులో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సంస్థను లాభాల బాట పట్టించి ఆక్యూపెన్సీ పెంచటమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా బస్సు పాసులు, టిక్కెట్లు, చిల్లర సమస్యలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ శకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది.

టికెట్ల జారీని మరింత సరళతరం చేయనుంది తెలంగాణ ఆర్టీసీ. ప్రస్తుతం ఉన్న టికెట్ జారీ యంత్రాలు (టిమ్స్) స్థానంలో ఇంటెలిజెంట్ టికెట్ జారీ యంత్రాలు (ఐటిమ్స్) తీసుకురానుంది. ఫలితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి.. టికెట్లు పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా బస్ పాసులను జారీ చేయాలని నిర్ణయించుకుంది ఆర్టీసీ. మెట్రో తరహాలో స్మార్ట్ పాసులను చేపట్టనుంది. ముందుగా హైదరాబాద్ సిటీలో స్మార్ట్ పాసులను ప్రారంభించనున్నారు. చిల్లర సమస్య, లెక్కల్లో తేడాలు వంటి చిక్కుముడులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్మార్ట్ కార్డులను ఆర్టీసీ కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మెట్రో తరహాలో ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ప్రతిసారీ టికెట్‌ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కార్డులో ఉన్న మొత్తం నుంచి ఛార్జీ డబ్బులు మినహాయించుకుని టికెట్లు ఇస్తారు. తద్వారా చిల్లర సమస్యకు చెక్ పడటంతో పాటు.., లెక్కలో తేడాలు రాకుండా ఉంటాయి. తొలి దశలో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 3,087 సర్వీసుల్లో 3,500 ఐటిమ్స్‌ యంత్రాలను వినియోగిస్తారు.

ఈ ఐటిమ్స్ యంత్రాలతో పాటు స్మార్ట్ కార్డులు, మొబైల్ యాప్ టెక్నాలజీ కోసం తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే టెండర్లను ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 2వ తేదీ లోపు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంది. అదే రోజు టెక్నాలజీని పరిశీలిస్తారు. అనంతరం గుత్తేదారులను ఎంపిక చేస్తారు. 2023 మార్చి లోపు ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులను తీసుకురావాలని లక్ష్యంగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ చర్యలు చేపట్టింది.

Whats_app_banner