అలాంటిదేం లేదు.. వ్యవసాయ రంగంలో విద్యుత్ కోతలపై ట్రాన్స్ కో సీఎండీ క్లారిటీ
రాష్ట్రంలో వ్యవసాయానికి ఎలాంటి విద్యుత్ కోతలు లేవన్నారు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. నిన్న కొన్ని అనివార్య కారణాలతో పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి అందించే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని చెప్పారు.
అనివార్య కారణాల వల్ల గురువారం కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఎన్‌పీడీసీఎల్ సంస్థలో నిన్న కొంత సమాచార లోపంతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని వివరణ ఇచ్చారు. నేటి నుంచి రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యధావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదన్నారు ప్రభాకర్ రావు. రైతన్నలు ఎవరు ఆందోళన చెందల్సిన అవసరం లేదన్న ఆయన.. ఇన్ని రోజులు ఏ విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా ఉందో అలానే ఉంటుందని చెప్పారు.
ఇక రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరిపోతోంది. ఇదిలా ఉంటే నిన్న పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా వ్యవసాయానికి అందించే త్రీఫేజ్ కరెంట్ విషయంలో ఇది జరిగిందనే వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వీటిపై క్లారిటీ ఇచ్చారు.