TS High Court : కార్మికుల కనీస వేతనాల పెంపు, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు!-ts high court ordered government release gazette notification on 73 schedule workers wages pay scale hike ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court : కార్మికుల కనీస వేతనాల పెంపు, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు!

TS High Court : కార్మికుల కనీస వేతనాల పెంపు, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు!

Bandaru Satyaprasad HT Telugu
Oct 09, 2023 03:29 PM IST

TS High Court On 73 Schedule Wages : సంఘటిత, అసంఘటితరంగ కార్మికుల కనీస వేతనాల పెంపుపై టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గతంలో జారీ చేసిన జీవోలకు గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించాలని ఆదేశించింది.

టీఎస్ హైకోర్టు
టీఎస్ హైకోర్టు

TS High Court On 73 Schedule Wages : తెలంగాణలో సంఘటిత, అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసినప్పటికీ, రెండేళ్లుగా వాటి అమలుకు గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ జారీ చేయకుండా జాప్యం చేస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై సోమవారం హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. సవరించిన జీవోలను ఆరు వారాల్లోగా ప్రచురించాలని ఆదేశించింది. 149 ప్రభుత్వ, ప్రైవేట్‌‌ విభాగాల్లో 1,07,64,788 మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వీరికి ప్రతి ఐదేళ్లకోసారి కనీస వేతనాలు పెంచాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని చిక్కుడు ప్రభాకర్‌‌ కోర్టుకు తెలిపారు. 2006 ఫిబ్రవరి 16న కనీస వేతనాలు పెంచారని, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు పెంచాల్సిన వేతనాలు పెంచలేదని తెలిపారు. వీరికి కనీస వేతనాలను పెంచితే పరోక్షంగా రూ.1 కోట్ల 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందన్నారు.

1.20 కోట్ల మందికి ప్రయోజనం

73 షెడ్యూల్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి సవరించిన జీవోలను ఆరు వారాల్లోగా గెజిట్ లో ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో ప్రత్యక్షంగా 47 లక్షల మంది కార్మికులకు, పరోక్షంగా 1.20 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందన్నారు. మెరుగైన వేతనాల ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలను పొందుతారన్నారు.

2006లో వేతనాలు సవరణ

తెలంగాణ ప్రభుత్వం 2021 జూన్‌‌లోనే సెక్యూరిటీ సర్వీసెస్‌‌ కోసం కనీస వేతనాల పెంపుపై జీవో ఎంఎస్‌‌ 21, నిర్మాణ రంగ కార్మికుల కోసం జీవో 22, స్టోన్‌‌ క్రషర్‌‌ వర్కర్స్‌‌ కోసం జీవో 23, ప్రాజెక్టులు, డ్యామ్‌‌ల నిర్మాణ కార్మికుల కోసం జీవో 24, ప్రైవేట్‌‌ మోటార్‌‌ ట్రాన్స్‌‌పోర్టు సెక్టార్‌‌ కార్మికుల కోసం జీవో ఎంఎస్‌‌ 25ను జారీ చేసింది. ఆ జీవోల అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్‌‌ నోటిఫికేషన్లు జారీ చేయలేదు. గెజిట్ జారీచేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.

పిటిషనర్‌ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ... షెడ్యూల్ ఉద్యోగాలకు కనీస వేతనాల సలహా మండలి సిఫార్సులతో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు నిర్ణయించాలని కోరారు. ఐదేళ్లలోపు కనీస వేతనాలను సవరించాలన్నారు. 2006లో 73 షెడ్యూల్‌ ఉద్యోగాలకు కనీస వేతనాలు సవరించారని, గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను సవరించలేదన్నారు.

Whats_app_banner