NTR: టీఆర్ఎస్ ‘తారక’ మంత్రం… వ్యూహంలో భాగమేనా…!-trs ministers and leaders pay tributes at ntr ghat in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ntr: టీఆర్ఎస్ ‘తారక’ మంత్రం… వ్యూహంలో భాగమేనా…!

NTR: టీఆర్ఎస్ ‘తారక’ మంత్రం… వ్యూహంలో భాగమేనా…!

HT Telugu Desk HT Telugu
May 28, 2022 06:46 PM IST

ఎన్టీఆర్ శత జయంతి వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధికార టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు... ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఇలా టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ ఘాట్ రావటం వెనుక కేసీఆర్ వ్యూహం ఉందన్న చర్చ మొదలైంది.

<p>ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీఆర్ఎస్ మంత్రులు, నేతలు నివాళులు</p>
ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీఆర్ఎస్ మంత్రులు, నేతలు నివాళులు (twitter)

ఎన్టీఆర్ ఘాట్ కు టీఆర్ఎస్ నేతలు..! అదేదో సాదాసీదా నేతలు కాదండోయ్..! వెళ్లినవారిలో ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలే ఉన్నారు. శతజయంతి వేళ నివాళులు అర్పించిన సదరు నేతలు... చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కీర్తిని పొగుడుతూనే... భారతరత్న ఇవ్వాలంటూ ఓ డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు సరిగ్గా ఈ పరిణామాలే తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

వ్యూహంలో భాగమేనా...

గతంలో ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ ఘాట్ కు రాని టీఆర్ఎస్ పార్టీ నేతలు.. ఈసారి వెళ్లటం తొలిసారి అనే చర్చ నడుస్తోంది. ఇందులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రావటం కూడా ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీలో పని చేసిన ఎంపీ నామా నాగేశ్వర రావు, మంత్రి మల్లారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, వివేకానంద పని చేసిన చరిత్ర ఉంది. వీరే కాకుండా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు... ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో టీఆర్ఎస్ నేతలు ఇలా చేయడం వెనుక వ్యూహం ఉందన్న వాదన నడుస్తోంది.

కారణాలు ఇవేనా…!

సడెన్ గా ఇలా టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లటం.. కీర్తించటం వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉండే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ జాతీయ రాజకీయాల్లో భాగంగానే తెలుస్తోంది.  ఇదిలా ఉంటే తెలంగాణలోని పలు జిల్లాలో టీడీపీ కేడర్ కాస్త బలంగానే ఉంది. ఆ ప్లేస్ ను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చూస్తోంది టీఆర్ఎస్. దీనికి ఓ లెక్కే ఉంది..! రేవంత్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గతంలో ఆయన టీడీపీలో కీలకంగా పని చేయటంతో పాటు క్షేత్రస్థాయి నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ కేడర్ లోనూ ఆయనపట్ల పాజిటివ్ ఓపినియన్ ఉండే అవకాశం ఉంది. ఈ అవకాశం ఏ మాత్రం ఇవ్వకుండా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉంది గూలాబీ దళం. ఇక ఎన్టీఆర్ సామాజికవర్గ ఓటు బ్యాంకును కూడా ఆకర్షించేందుకు టీఆర్ఎస్… తారక మంత్రాన్ని ఎత్తుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లటం... భారతరత్న డిమాండ్ చేయటం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి..!

Whats_app_banner