Medak District News : చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి-three people drowned while going fishing in medak district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak District News : చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి

Medak District News : చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి

HT Telugu Desk HT Telugu
Feb 08, 2024 10:29 PM IST

Medak District Crime News : మెదక్ జిల్లాలో చేపలు పట్టడానికి వెళ్లి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. రెండు వేర్వురు చోట్ల ఈ ఘటనలు జరిగాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో విషాదం representative image
మెదక్ జిల్లాలో విషాదం representative image (unshplash)

Medak District Crime: మెదక్ జిల్లాలో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. చేపల పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి రెండు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామానికి చెందిన బుర్రి యాదగిరి(57),మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లికి చెందిన యాసిన్ ఖాన్ (58) కుటుంబాలు స్థానికంగా కూలీ పనిలు చేసుకుంటూ,సాయంత్రం శనగలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి బుధవారం చేపలు పట్టడానికి పరికిబండ గ్రామంలో ఉన్న కుడి చెరువు వద్దకు వెళ్లారు. వీరు చెరువు లోతు ఎక్కువగా ఉన్నచోటుకి వెళ్లి చేపల వల విసిరారు. ఆ వల ప్రమాదవశాత్తు కాళ్ళకు చుట్టుకోవడంతో వారు చెరువులో మునిగిపోయారు. చేపలు పట్టడానికి వెళ్ళినవారు తిరిగి ఇంటికి రాకపోవడంతో దీంతో కుటుంబసభ్యులు అనుమానంతో గ్రామస్తులను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ వారి విడిచిన బట్టలు కనిపించాయి. దీంతో గ్రామానికి చెందిన ఇద్దరూ వ్యక్తులు నీటిలోకి దిగి గల్లంతైన మృతదేహాల కోసం గాలించారు. చెరువులో వారి మృతదేహాలు లభించాయి. ఈ ఘటనతో వారి కుటుంబాలు విషాదంలో మునిగి పోయాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో .....

చేపలు పట్టడానికి చెరువుకు వెళ్ళిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన బుధవారం మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలంపల్లి గ్రామానికి చెందిన యాట లక్ష్మణ్ (25) మంగళవారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల,బంధువుల దగ్గర వెతికిన అతని ఆచూకీ లభించలేదు. బుధవారం స్థానికులు చేపలు పట్టడానికి వెళ్లాడని చెప్పారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు బుధవారం సాయంత్రం పోలంపల్లి గ్రామ శివారులో ఉన్న తుర్కల చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని బట్టలు,చెప్పులు కనిపించాయి. దీంతో వారు గజ ఈతగాళ్ళని రప్పించి చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు కుటుంసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కుంటలోపడి మరో యువకుడు ....

ప్రమాదవశాత్తు కుంటలోపడి మరో యువకుడు మృతి చెందిన సంఘటన అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ శివారులో బుధవారం జరిగింది. ముస్లాపూర్ గ్రామానికి చెందిన రమేష్ (22) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికులు బుధవారం సాయంత్రం పాలకుంటలో మృతదేహం తేలుతుందని గ్రామస్థులకు తెలిపారు. వారు వచ్చి ఆ మృతదేహం రమేష్ గా గుర్తించారు. రమేష్ కు తల్లితండ్రులు లేరు. అన్నదమ్ములు ఉరికి దూరంగా ఉన్నారు. కావున రమేష్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు. ఎవరైనా తీసుకెళ్లి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి

టీ20 వరల్డ్ కప్ 2024