TS Govt : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్-ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు
Employee Health Care Trust : ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. నగదు రహిత చికిత్స అందించేందుకు ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది.
Employee Health Care Trust : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ తీపు కబురు చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబసభ్యులకు నగదు రహిత, మెరుగైన చికిత్స అందించేందుకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ను ప్రత్యేకంగా ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈ.హెచ్.సి.టి) ఏర్పాటు చేసి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నెంబర్ 186 విడుదల చేసింది. వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసిఆర్ తీపికబురు అందించారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొదటి పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా జమ చేయాలని పేర్కొంది. ఈ మేరకు తమ మూలవేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
సభ్యులు వీరే
ఆ నివేదిక ప్రకారం ఈహెచ్‌ఎస్ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈ.హెచ్.సి.టి) పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో సభ్యులుగా ఉంటారు. అలాగే ఈహెచ్‌ఎస్ సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల తరఫున ఆరుగురిని, పెన్షనర్ల తరఫున ఇద్దరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. అలాగే విధాన నిర్ణయాలకు సంబంధించి బోర్డ్ సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈహెచ్ఎస్ సీఈవోగా నియమిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ కాంట్రూబ్యుషన్ గా ట్రస్టుకు ప్రతి నెల నిర్దేశిత మొత్తాన్ని జమ చేస్తారు. ఈ మొత్తం ప్రతినెల వారి వేతనం నుంచి ఆటోమెటిక్‌గా ట్రస్ట్‌కు బదిలీ అవుతుంది. ప్రభుత్వం అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి నెల జమ చేస్తుంది. ఈహెచ్ఎస్ నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు 15 పోస్టులను మంజూరు చేసింది.
మంత్రి హరీశ్ రావు హర్షం
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని అందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపతున్నానన్నారు. తాము ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు దాంతో పాటు బీఅర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయంతో మరోసారి రుజువు చేశారన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్