Eco Bridge For Animals : అక్కడ కింది నుంచి వాహనాలు.. పైనుంచి జంతువులు
Bridge For Animals : రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో వన్యప్రాణులు చనిపోతున్నాయి. రాత్రుళ్లు, పగటి పూట వేగంగా వెళ్లే వాహనాల తాకి ప్రాణాలు వదులుతున్నాయి. దీంతో ప్రభుత్వం వన్యప్రాణుల కోసం పర్యావరణ వంతెనను నిర్మిస్తోంది.
అటవీ ప్రాంతాల్లో హైవేలు(High Way).. ఫలితంగా వన్యప్రాణుల(Wild Animals) ప్రాణాలు పోతున్నాయి. ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో అటవీ జంతువులు చనిపోయాయి. అయితే జంతువుల సెఫ్టీ(Animals Safety) గురించి ఆలోచించిన ప్రభుత్వం ఎకో బ్రిడ్జి(Eco Bridge)ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఎలా అంటే.. కింద నుంచి వాహనాలు వెళ్తుంటే.. పైనుంచి జంతువులు వెళ్తాయి. ఎవరిదారిలో వారే వెళ్లే విధంగా పర్యావరణ వంతెనను నిర్మిస్తోంది ప్రభుత్వం.
వన్యప్రాణులు సౌకర్యవంతంగా, సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా తెలంగాణ(Telangana)లో తొలి ఓవర్‌పాస్(Over Pass) పర్యావరణ వంతెన నిర్మితమవుతోంది. 63వ జాతీయ రహదారి(NH 63)పై మంచిర్యాల-చంద్రాపూర్ మార్గంలో రాబోతోంది. అటవీ ప్రాంతాలలో హైవేలపై ట్రాఫిక్(Traffic) కారణంగా వన్యప్రాణులకు అంతరాయం కలుగుతోంది. అవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అవతలి వైపు వెళ్ళేందుకు ప్రయత్నాలు చేసి.. ప్రాణాలు కూడా పొగొట్టుకుంటున్నాయి.
అటవీ ప్రాంతాల్లో నిర్మించిన సాంప్రదాయ అండర్‌పాస్(Under Pass)ల మాదిరిగా కాకుండా వాంకిడి సమీపంలో ఓవర్‌పాస్ పర్యావరణ వంతెన నిర్మాణం అవుతోంది. వన్య జంతువులు పైనుంచి వెళతాయి. వాహనాల రాకపోకలు వంతెన కింద నుంచి జరుగుతుంది. ఇది జంతువులు, ముఖ్యంగా పులుల సజావుగా వెళ్లేందుకు సహాయపడుతుంది. కాగజ్‌నగర్ అడవుల్లోని మంచిర్యాల - చంద్రాపూర్ మార్గం చాలా ముఖ్యమైనది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ(Telangana)లోకి వలస వచ్చే సమయంలో పులులు సాధారణంగా ఆ మార్గం గుండా వెళతాయి.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సుమారు 1 కి.మీ పొడవుతో ఓవర్‌పాస్ వంతెన(Over Pass Bridge)ను నిర్మిస్తోంది. రూ.30 కోట్లతో నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలంగాణ అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పనుల వేగాన్ని బట్టి, దాదాపు ఆరు నెలల్లో నిర్మాణం సిద్ధం అవుతుందన్నారు. NHAI సివిల్ పనులను చేపడుతుండగా, నిర్మాణ రూపకల్పన, స్థాన గుర్తింపు, పర్యావరణ అంశాలు, పనుల అమలులో అటవీ శాఖ సమన్వయం చేస్తోంది. వైల్డ్‌లైఫ్(Wild Life) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం నిర్మాణం జరుగుతోంది.
సాధారణంగా అడవి జంతువులు రాత్రి సమయంలో అండర్‌పాస్‌ల గుండా వెళ్లడానికి భయపడతాయని ఓ అటవీ అధికారి తెలిపారు. తగినంత స్థలం లేకపోవటం, వెలుతురు సరిగా లేకపోవడం, కొన్నిసార్లు వర్షపునీటితో నిండిపోవడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. అడవి జంతువులు సౌకర్యవంతంగా, సురక్షితంగా రహదారిని దాటడానికి వీలుగా ఓవర్‌పాస్ వంతెనను నిర్మిస్తున్నట్టుగా చెప్పారు. వంతెనకు ఇరువైపులా పచ్చదనం ఉంటుంది.