Congress Protest | కాంగ్రెస్ వినూత్న నిరసనలు.. గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి.. ప్లేట్లతో చప్పుళ్లు-telangana congress leaders protest against petrol diesel and gas price hike ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Protest | కాంగ్రెస్ వినూత్న నిరసనలు.. గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి.. ప్లేట్లతో చప్పుళ్లు

Congress Protest | కాంగ్రెస్ వినూత్న నిరసనలు.. గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి.. ప్లేట్లతో చప్పుళ్లు

HT Telugu Desk HT Telugu
Mar 31, 2022 03:18 PM IST

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్‌ పార్టీ.. నిరసన వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంపునకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశారు.

<p>పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన</p>
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలో చేపట్టిన నిరసనకు మద్దతుగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామంలో ఆందోళన జరిగింది. నిరసన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. దేశం అభవృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే విధంగా ధరలు పెంచుతుందని భట్టి అన్నారు.

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని అలాగే రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఇచ్చే కరెంట్ కోతలు ఎత్తివేయాలని జడ్చర్ల లో కాంగ్రెస్ పార్టీ చేసిన రాస్తారోకోలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్  ఛైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల నియంత్రణ చట్టాన్ని కార్పొరేట్ శక్తుల కోసం మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులు నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి.. ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా.. గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి మహిళా కాంగ్రెస్ నాయకులు ప్లేట్ల పైన శబ్దం చేస్తూ చావు డప్పు వాయించారు.

మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై.. టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ , టిఆరెస్ రెండు కలసి రైతులని మోసం చేస్తున్నాయన్నారు. నీళ్లు , నిధులు , నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నామన్నారు. రైతులు పండించిన పంటని కొనలేని దుస్థితిలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. రైతులు పండించిన చివరి గింజ కోనేవరకు పొరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెబితే.. ఆయనను టీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తారా అని.. అయోధ్య రెడ్డి అన్నారు. రెవంత్ రెడ్డి అంటే తెలంగాణ దిక్సూచి అని అయోధ్య రెడ్డి అన్నారు. నిరుద్యోగుల గురించి కేసీఆర్ ని బాల్క సుమన్ ప్రశ్నించాలన్నారు. రేవంత్ పేరు చెపితే కెసీఆర్ కు వణుకు పుట్టి హాస్పిటల్ కి వెళుతున్నాడని విమర్శించారు.

ప్రభుత్వంలో ఉన్న కొందరి మాటలు చూస్తే రేవంత్ పై ఏమైనా ప్లాన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి సుదీర్ రెడ్డి అన్నారు. బాల్క సుమన్ బెదిరిస్తే మేము బెదిరేవాళ్లం కాదని స్పష్టం చేశారు. డ్రగ్స్, కరెంట్, సంక్షేమ పథకాల మీద సవాల్ విసిరినా.. సమాధానం లేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి బాల్క సుమన్ బానిస అని సుదీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేం అభివృద్ధిపై మాట్లాడుతున్నాం.. బాల్క సుమన్ నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడదామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యక్రమాలతో కేసీఆర్ కి రెండు మూడు రోజులకు జ్వరం వస్తుందని సుదీర్ రెడ్డి అన్నారు.

Whats_app_banner