HYD Drugs Case: డ్రగ్స్ కేసులో సినీ దర్శక, నిర్మాతలు అరెస్ట్
HYD Drugs Case: హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత, దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఎస్వోటి పోలీసులు వాసువర్మ అనే సినీ నిర్మాతను అదుపులోకి తీసుకున్నారు.
HYD Drugs Case: హైదరాబాద్‌లో వెలుగు చూస్తున్న మాదక ద్రవ్యాల కేసుల్లో లింకులన్నీ చివరకు సినీ ఇండస్ట్రీతోనే బయట పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఏ ఘటనలో మూలాలు వెదికినా చివరకు అవి సినీ పరిశ్రమకు చెందిన వారితోనే ఉన్నట్లు బయటపడుతోంది. మాధాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో సినీ నిర్మాతలు డ్రగ్ పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఘటన మరువక ముందే మరో వ్యవహారం వెలుగు చూసింది.
సినీ పరిశ్రమకు చెందిన దర్శక, నిర్మాతలు డ్రగ్స్ వినియోగిస్తున్న కేసులో అరెస్ట్ అయ్యారు. సినీ దర్శకుడు మంతెన వాసువర్మను మాదాపూర్ పోలీసులు సెప్టెంబర్ 5న అరెస్టు చేశారు. నిందితుడి అరెస్ట్ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ విషయం ఆదివారం వెలుగు చూసింది. ఇదే కేసులో సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్ దివాకర్, పుణేకు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ అశోక్ తెలోర్‌లను గత జూన్‌లోనే అరెస్ట్ చేశారు.
ముంబయికి చెందిన విక్టర్, పుణేలో ఉంటున్న రాహుల్ అశోక్ తెలోర్ లు డ్రగ్ పెడ్లర్లు ఉన్నారు. తమకు తెలిసిన వారికి డ్రగ్స్ విక్రయిస్తుంటారు. రాహుల్, విక్టర్ నుంచి నార్సింగికి చెందిన సినీ రచయిత పృథ్వీకృష్ణ డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగించేవాడు.
డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఈ ఏడాది జూన్ 19న పృథ్వీకృష్ణ, రాహుల్ తెలోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 70 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో 'బస్తీ' చిత్ర దర్శక, నిర్మాత, శేరిలింగంపల్లిలో ఉంటున్న మంతెన వాసువర్మ కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తేలింది.
కేసును దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు సెప్టెంబర్ 5న వాసువర్మను అరెస్టు చేశారు. వాసువర్మ, పృథ్వీకృష్ణ కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసే విక్టర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుడు పట్టుబడితే ఇంకెవరికి ఈ కేసులో లింకులు ఉన్నాయనేది బయట పడుతుందని చెప్పారు.