Covid positve pregnant కోవిడ్ పాజిటివ్ గర్భిణికి పీహెచ్‌సీలో అత్యవసర ప్రసూతి సేవ
Covid 19 పాజిటివ్ ఉన్న గర్భిణికి అత్యవసర సమయంలో ప్రసూతి సేవలు అందించిన ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రశంసలు అందుకుంటోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలోని వైద్య సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్‌తో బాధపడుతున్న ఓ గర్భిణికి అత్యవసరంగా ప్రసూతి సేవలు అందించారు. పీహెచ్‌సీలో ఆ గర్భిణి ప్రసవించి పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ట్విటర్ ద్వారా తెలియపరిచారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. దీనిపై స్పందిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, స్థానిక శాసన సభ్యుడు, మంత్రి కేటీఆర్ పీహెచ్‌సీ సిబ్బందిని ప్రశంసించారు. కాగా తల్లీ బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కోవిడ్ పాజిటివ్ గర్భిణికి అత్యవసర సేవలు అందించడంతో పాటు ప్రసూతి సాయం అందించి పలు ఆసుపత్రులు, వైద్య సిబ్బందికి స్ఫూర్తిగా నిలిచారంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు లభించాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గర్భిణుల్లో వైద్య సేవల లభ్యతపై ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన వారిలో ధైర్యాన్ని నింపినట్టయింది.
సంబంధిత కథనం