ACB Raids On Tahsildar : రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్
ACB Raids On Tahsildar : మ్యుటేషన్ పూర్తైన భూమికి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ ఎట్టకేలకు ఏసీబీకి చిక్కాడు. తహసీల్దార్ తో పాటు వీఆర్ఏ కుమారుడు, డ్రైవర్ ను ఏసీబీ అరెస్టు చేసింది.
ACB Raids On Tahsildar : కాసులకు కక్కుర్తిపడ్డాడు. కరెన్సీ నోట్లు ఇస్తేనే ఏ పని అయినా చేస్తాడు. చేతికి మట్టి అంటకుండా నేరుగా అవినీతి సొమ్మును తీసుకోకుండా తన అనుచరుల ద్వారా లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్ తో సహా ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ జహెద్ పాషా రైతు నుంచి పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తహసీల్దార్ తో పాటు వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాద్ ముగ్గురు అరెస్టు అయ్యారు. వారి నుంచి లంచంగా స్వీకరించిన పదివేల రూపాయలను సీజ్ చేశారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం కాల్వశ్రీరాంపూర్ మండల పందిళ్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 645/అ లో 28 గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట ఉంది. అన్ని ధ్రువపత్రాలు ఉన్నా కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడడంతో వివాదం నెలకొంది. పెండింగ్ మ్యుటేషన్ కోసం ఎన్నోసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో జిల్లా అధికారులను కలవగా గత నెల 23న మ్యుటేషన్ పూర్తయింది.
పూర్తైన మ్యుటేషన్ కోసం డబ్బులు డిమాండ్
పూర్తైన ముటేషన్ కు తహసీల్దార్ తో పాటు రెవెన్యూ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేశారు. గతంలో పలుమార్లు వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణుకు ఫోన్ పే ద్వారా తిరుపతి రూ.15 వేలు పంపించాడు. మరికొంత నగదు కావాలని తిరుపతిని రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తహసీల్దార్ డిమాండ్ ప్రకారం రూ.పది వేలు తిరుపతి శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఇచ్చేందుకు వెళ్లగా తహశీల్దార్ తెలివిగా తీసుకోకుండా వీఆర్ఏ కుమారుడు విష్ణు డ్రైవర్ అంజాద్ కు ఇచ్చి వెళ్లాలని ఆదేశించారు. తహశీల్దార్ ఆదేశంతో విష్ణు, అంజాద్ పది వేలు రైతు తిరుపతి నుంచి స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని విచారిస్తే తహసీల్దార్ ఆదేశంతో తీసుకున్నామని చెప్పడంతో తహసీల్దార్ తో పాటు ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ప్రకటించారు.
తహసీల్దార్ పై అవినీతి ఆరోపణలు
ప్రస్తుతం ఏసీబీకి పట్టబడ తహసీల్దార్ జహెద్ పాషా పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ తహసీల్దారుగా, తహసీల్దారుగా ఎక్కడ పనిచేసినా డబ్బులు ఇస్తే ఏ పని అయినా చేస్తాడని పలువురు ఆరోపించారు. కరెన్సీ నోట్లకు కక్కుర్తి పడ్డ జహెద్ పాషా పాపం చివరకు కాల్వ శ్రీరాంపూర్ లో పండిందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం