ACB Trap : స్టేషన్‌ బెయిల్‌ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై-parvathagiri si caught by acb demanding bribe for station bail in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Trap : స్టేషన్‌ బెయిల్‌ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

ACB Trap : స్టేషన్‌ బెయిల్‌ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 07:13 AM IST

Parvathagiri SI Caught by ACB : స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసిన పర్వతగిరి ఎస్సై ఏసీబీకి చిక్కాడు. డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై
స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా కొందరు ఆఫీసర్లలో మార్పు రావడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే పలు ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్ జరిగి, అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా, శుక్రవారం మరో ఘటన చోటు చేసుకుంది. 

బెల్లం వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేసి, వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోతు వెంకన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా, ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని అధికారులు ఎస్సై వెంకన్న గుట్టురట్టు చేశారు. దీంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ జిల్లా పర్వతగిరి మీదుగా గుడుంబా తయారీకి బెల్లం రవాణా జరుగుతుంటుంది. కాగా జూన్ 27 శనివారం రాత్రి సమయంలో పర్వతగిరి ఎస్సై గుగులోతు వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అన్నారం క్రాస్ రోడ్డు వద్ద బెల్లం లోడ్ వెహికిల్ పట్టు బడింది. దీంతో ఎస్సై వెంకన్న ఆ బెల్లం లోడ్ వాహనాన్ని స్టేషన్ కు తరలించి, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బండి ఓనర్ భాస్కర్, డ్రైవర్ రాజేశ్, మరో వర్కర్ రవిపై కేసు నమోదు చేశాడు.

స్టేషన్ బెయిల్ ఇస్తానని రూ.70 వేలు డిమాండ్

వాస్తవానికి బెల్లం లోడ్ తో వాహనం పట్టుబడగా, 35 క్లాజ్ 3 బీఎన్ఎస్ఎస్ ప్రకారం నిందితులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఎస్సై వెంకన్న బెల్లం వ్యాపారి నుంచి డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో నోటీసులు ఇవ్వకుండా స్టేషన్ చుట్టూ తిప్పుకున్నాడు. దీంతో మరో వ్యక్తి ద్వారా ఎస్సై వెంకన్నను గుట్టుగా సంప్రదించగా, రూ.70 వేలు ఇస్తే స్టేషన్ బెయిల్ ఇస్తానని, లేదంటే జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించాడు. 

దీంతో ఆ మరునాడే ఆదివారం రూ.20 వేలు మధ్యవర్తికి ఫోన్ పే ద్వారా చెల్లించారు. కాగా మిగతా రూ.50 వేల కోసం ఎస్సై వెంకన్న భాస్కర్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో రూ.40 వేలకు బేరం కుదరగా… ఎస్సైకి అంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేక ఆయన వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 

ఈ మేరకు డీఎస్పీ సాంబయ్య పథకం ప్రకారం శుక్రవారం… స్టేషన్ డ్రైవర్ సదానందం ద్వారా రూ.40 వేలు ఇచ్చారు. అప్పటికే తమ ప్లాన్ లో భాగంగా పర్వతగిరి స్టేషన్ కు చేరుకుని ఉన్న ఏసీబీ అధికారులు డ్రైవర్ సదానందం, ఎస్సై వెంకన్నను పట్టుకున్నారు. కాగా ఇద్దరికీ శనివారం ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు డీఎస్పీ సాంబయ్య వివరించారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య పిలుపునిచ్చారు. లంచం అడిగితే వెంటనే 1064 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

భూవివాదంలో అన్నపై తమ్ముడి హత్యాయత్నం

వరంగల్ నగరంలో శుక్రవారం సాయంత్రం దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భూ వివాదంలో తన సొంత అన్నపైనే కత్తి దూసాడు. మటన్ కొట్టే కత్తితో మెడపై దాడి చేయడంతో తీవ్ర రక్త స్రావం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేటకు చెందిన రావుల రాజు, రావుల రాజేష్ ఖన్నా అన్నదమ్ములు. చిన్న వాడైన రాజేష్ ఖన్నా కొంతకాలంగా మద్యానికి అలవాటు పడ్డాడు. దొరికిన చోటల్లా అప్పులు చేయడం, తన తల్లి లక్ష్మికి సంబంధించిన బంగారాన్ని కూడా అమ్మేసి జల్సాలకు ఖర్చు చేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రావుల రాజు కుటుంబ బాధ్యతలను తీసుకున్నాడు. తమ్ముడు చేసిన అప్పులు కట్టి, తన చెల్లి పెళ్లి కూడా చేశాడు. ఓ వైపు కుటుంబ పెద్దగా వ్యవహరించడం, అన్నీ తానై చూసుకుంటుండటంతో తల్లి లక్ష్మీ తన పేరున ఉన్న కొంత ఇంటి స్థలాన్ని కొంతకాలం కిందటే రాజు పేరున రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది.

తన తల్లి రాజు పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయడంతో విషయం తెలుసుకున్న రాజేష్ ఖన్నా అసహనానికి గురయ్యాడు. ఆ భూమిలో తనకూ భాగం ఉందని, తనకు రావాల్సిన స్థలాన్ని తనకు అప్పగించాలంటూ అన్నపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో కొద్దిరోజులుగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పోయాయి. ఇద్దరి పంచాయితీ కాస్త పెద్ద మనుషుల దాకా వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య సంధి కుదిర్చిన పెద్ద మనుషులు రాజేష్ ఖన్నాకు భూమికి బదులు రూ.8 లక్షలు చెల్లించేలా తీర్మానం చేశారు. ఈ మేరకు ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఈ మేరకు కొద్ది రోజుల కిందట ఒప్పందంలో భాగంగా రావుల రాజు తన తమ్ముడైన రాజేష్ ఖన్నాకు ముందస్తుగా రూ.3 లక్షలు చెల్లించాడు. ఇంకో రూ.5 లక్షల వరకు పెండింగ్ ఉండగా, ఆ విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. రూ.5 లక్షలు చెల్లించేందుకు కొంత సమయం కావాలని రావుల రాజు కోరగా, అందుకు రాజేష్ ఖన్నా ససేమిరా అన్నాడు. అనంతరం తనకు అసలు డబ్బులే వద్దని, తన భూమిని తనకు అప్పగించాలని మళ్లీ విషయాన్ని మొదటికి తీసుకొచ్చాడు. దీంతో అన్న దమ్ముల మధ్య కొద్దిరోజులుగా వాదనలు జరుగుతున్నాయి. 

కాగా శుక్రవారం రావుల రాజు తన మటన్ షాపులో పని చేసుకుంటుండగా, రాజేష్ ఖన్నా అక్కడికి వచ్చాడు. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగగా, ఆవేషానికి లోనైన రాజేష్ ఖన్నా అక్కడే ఉన్న మటన్ కొట్టే కత్తితో అన్న రాజుపై దాడి చేశాడు. మెడ భాగంలో కత్తితో వేటు వేయగా, ఒక్కసారిగా రాజు కేకలు వేస్తూ పరుగులు తీశాడు. ఇంతలోనే అక్కడున్న వాళ్లంతా గమనించడంతో రాజేష్ ఖన్నా అక్కడి నుంచి పరారయ్యాడు.

తమ్ముడి చేతిలో దాడికి గురైన రాజుకు తీవ్ర రక్త స్రావం జరగగా..  వెంటనే ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్త స్రావం బాగా జరగడంతో తగిన చికిత్స అందించి, ఎంజీఎం ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. కాగా అన్నపై దాడికి పాల్పడిన రాజేష్ ఖన్నా అక్కడి నుంచి పరారు కాగా… పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)