Bhatti Vikramarka : బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయి- భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికల కోసం కనీస వేతన చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Bhatti Vikramarka : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా వారి హక్కులను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం గాంధీ భవన్ లో ఆయన అసంఘటిత రంగాల కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, పలువురు నేతలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్మికుల అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కార్మికులు, ఉద్యోగుల హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ నిర్వీర్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
9 ఏళ్లుగా వేతన బోర్డుపై సమీక్ష లేదు
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతన చట్టాన్ని తీసుకువచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో ఏదీ సరిగ్గా లేదని విమర్శించారు. 9 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో కనీస వేతన బోర్డుపై సమీక్ష నిర్వహించలేదని ఆక్షేపించారు. పర్మినెంట్ ఉద్యోగులు మాత్రమే ఉంటారు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ఉండదని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. కార్మికులు ఇకనైనా తమ హక్కుల కోసం, న్యాయపరమైన వేతనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా బీఆర్‌ఎస్ సర్కార్ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని భట్టి గుర్తుచేశారు.
కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకువస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు కాంగ్రెస్ అజెండాగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. తెలంగాణలో ఫ్యూడలిస్టుల ప్రభుత్వం, దేశంలోని క్యాపిటలిస్టుల ప్రభుత్వం చేసే కుటిల రాజకీయాల్లో కార్మికులు మోసపోవద్దని సూచించారు. శ్రమ దోపిడీ లేకుండా 8 గంటల పనివిధానం, మహిళలకు ప్రసూతి సెలవులు, అనేక కార్మిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి... కార్మికులకు హక్కులు కల్పించిన ఘనత డా.బీఆర్ అంబేడ్కర్‌కు దక్కుతుందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు.