Gouravelli Project : గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మంత్రి హరీశ్ భేటీ.. మధ్యలో కాంగ్రెస్-minister harish rao meet with gouravelli project expatriates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gouravelli Project : గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మంత్రి హరీశ్ భేటీ.. మధ్యలో కాంగ్రెస్

Gouravelli Project : గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మంత్రి హరీశ్ భేటీ.. మధ్యలో కాంగ్రెస్

HT Telugu Desk HT Telugu
Jun 15, 2022 07:29 PM IST

మంత్రి హరీశ్ రావు.. గౌరవెల్లి భూ నిర్వాసితులతో మాట్లాడారు. నిర్వాసితుల డిమాండ్లపై మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారు. అయితే ఈ సమావేశానికి.. కాంగ్రెస్ నేతలు సైతం వెళ్లారు.

<p>మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)</p>
మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

కాంగ్రెస్‌ నేతలతో కలిసి మంత్రి హరీష్‌రావుతో గౌరవెల్లి భూ నిర్వాసితులు చర్చించారు. మూడురోజులుగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మాజీ ఎంపీ పొన్నం, కాంగ్రెస్‌ నేతలతో కలిసి మంత్రితో మాట్లాడారు. సుమారు గంట జరిగిన చర్చల్లో మంత్రి హరీశ్‌రావుతో భూ నిర్వాసితులు చర్చించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. నిర్వాసితుల డిమాండ్లపై మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున నిర్వాసితుల డిమాండ్లు నెరవేర్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. దాడులు, లాఠీఛార్జీలతో సమస్య పరిష్కారకావన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు మొదట ప్రతిపాదన చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రాజెక్టు ఫలితాలు బాధితులకు అందటం లేదనే మంత్రితో మాట్లాడినట్టుగా చెప్పారు. 18 ఏళ్లకు పైబడిన వారికి ప్యాకేజ్, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ కీలకమైందన్నారు పొన్నాం. గ్రామస్థులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.

అయితే మరోవైపు.. భూ నిర్వాసితులు.. మంత్రి హరీశ్ రావుతో భేటీపై స్పందించారు. ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్‌కు మంత్రి హరీశ్‌రావు అంగీకారం చెప్పలేదన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేమని మంత్రి చెప్పినట్టుగా చెబుతున్నారు. గృహనిర్మాణం కోసం పట్టణానికి దగ్గర ఆమోదయోగ్యమైన స్థలాన్ని ఇవ్వాలని మంత్రిని కోరామన్నారు. ఇవ్వలేమని మంత్రి హరీశ్‌ చెప్పినట్టుగా నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని ఖాళీ చేస్తే.. స్థలాలను ఇచ్చేందుకు ఆలోచిస్తామని చెప్పారని అంటున్నారు.

భూ నిర్వాసితులతో సమావేశం కంటే.. ముందు మంత్రి హరీశ్ రావు గౌరవెల్లి ప్రాజెక్టు అంశంపై మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయన్నారు. భూనిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సీఎం అన్ని విధాలా న్యాయం చేస్తారన్నారు.

Whats_app_banner