Medak Crime : మద్యానికి బానిసైన తండ్రి, కొడుకు చేతిలో హతం-medak crime news in telugu son beats father with cricket bat to death ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime : మద్యానికి బానిసైన తండ్రి, కొడుకు చేతిలో హతం

Medak Crime : మద్యానికి బానిసైన తండ్రి, కొడుకు చేతిలో హతం

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 08:17 PM IST

Medak Crime : మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న తండ్రిని క్రికెట్ బ్యాట్ కొట్టాడు కొడుకు. ఈ దాడిలో దెబ్బ గట్టిగా తగలడంతో తండ్రి మృతి చెందాడు.

తండ్రిని చంపిన కొడుకు
తండ్రిని చంపిన కొడుకు

Medak Crime : మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తండ్రి తరచూ మద్యం తాగి వచ్చి కుటుంబసభ్యులతో గొడవ పడుతుండడంతో కోపంతో కొడుకు క్రికెట్ బ్యాట్ తో దాడి చేశాడు. ఈ దాడిలో తండ్రి మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మున్పుర్ గ్రామానికి చెందిన బత్తిని యాదగిరి (50) కి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య భూలక్ష్మికి ఒక కుమారుడు శ్రీకాంత్ ఉన్నాడు. అయితే మొదటి భార్య భూలక్ష్మి కొన్నేళ్ల కిందట యాదగిరిని, తన కొడుకుని వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత యాదగిరి దేవమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా దేవమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు దుర్గాప్రసాద్, చిన్న కొడుకు సిద్దార్ధ్ ఉన్నారు. యాదగిరి ముగ్గురు కొడుకులు కలిసి మెలిసి ఉండేవారు. కాగా యాదగిరి గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసగా మారాడు.

నిత్యం తాగి వచ్చి కుటుంబసభ్యులతో గొడవ

నిత్యం మద్యం తాగి వచ్చి ఆ మత్తులో కుటుంబసభ్యులతో గొడవ పడుతుండేవాడు యాదగిరి. మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నావని, కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నావని, మద్యం మానేయాలని కొడుకు చాలాసార్లు చెప్పుకొచ్చాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. మరల ఎప్పటిలాగానే తాగివచ్చి గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రోజు కూడా రోజులానే మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఇంట్లో వారితో గొడవ పడ్డాడు. దీంతో రెండో భార్య కొడుకు దుర్గాప్రసాద్ కోపంతో క్రికెట్ బ్యాట్ తో యాదగిరి ఛాతీపై బలంగా కొట్టాడు. దెబ్బ గట్టిగా తాకడం యాదగిరి కింద పడిపోయాడు. వెంటనే అతనిని కుటుంబసభ్యులు, స్థానికుల సహాయంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం యాదగిరి మృతి చెందాడు. తన తండ్రి మృతికి కారణమైన దుర్గాప్రసాద్ ను శిక్షించాలని మొదటి భార్య కొడుకు శ్రీకాంత్ ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner