Mahabubabad Murder: మహబూబాబాద్‌లో దారుణం.. భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం, నిందితుడి అరెస్ట్
Mahabubabad Murder: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెకు ఉరేసి చంపేశాడు. అనంతరం ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా చిత్రీకరించి అక్కడి నుంచి పరారయ్యాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా, కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు.
Mahabubabad Murder: మహబూబాబాద్‌లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరేసి హత్య చేసిన భర్త ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం స్టేషన్‌కు చెందిన బత్తుల వీరన్నకు ఇదే మండలం బోడ మంచ్యా తండా పంచాయతీకి చెందిన అనూష(30)తో 2011లో వివాహం జరిగింది.
వారికి కుమారుడు రాజేష్ ఉన్నాడు. అతను ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉండగా మొదటి నుంచి వారి దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది. కానీ కొంతకాలంగా వీరన్న తన భార్య అనూష పై అనుమానం పెంచుకున్నాడు.
ఉరి వేసి.. బావి దూలానికి వేలాడదీసి..
వీరన్న పెంచుకున్న అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు గొడవ పడుతుంటే తట్టుకోలేకపోయిన కుమారుడు రాజేష్ నాలుగు రోజుల కిందట తన అమ్మమ్మ ఊరైన బోడ మంచ్యా తండాకు వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం అర్ధ రాత్రి వీరన్న తన భార్య అనూషకు మధ్య మళ్లీ గొడవ జరగగా.. తీవ్ర కోపానికి గురైన వీరన్న అనూష కు ఉరి వేసి హత్య చేశాడు.
అనంతరం హత్య కేసు తన మీదకు రాకుండా అనూష సూసైడ్ చేసుకున్నట్టుగా క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. తన ప్లాన్ లో భాగంగా అనూష డెడ్ బాడీని తమ ఇంటి వెనక ఉన్న బావి దూలానికి వేలాడ దీశాడు. ఆమే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు.
అరెస్టు చేసిన పోలీసులు
అనూష మరణించిన విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనూష మృత దేహాన్ని చూసి బోరున విలపించారు. అనూషను భర్తే హత్య చేశాడంటూ ఆరోపించగా.. ఘటన సమాచారం అందుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్ రాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృత దేహాన్ని బావి దూలం నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరన్న అనుమానంతోనే భార్యకు ఉరి వేసి చంపిన అనంతరం ఉరేసుకుని చనిపోయిందన్నట్టుగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు.
ఈ క్రమంలో సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో వీరన్న ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అప్రమ్తమయ్యారు. వెంటనే అక్కడికి వెళ్లి వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ జరపగా.. అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)